
అందమైన కుటుంబ బంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో చక్కటి సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దశరథ్, విలక్షణ సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్‌ల క్రేజీ కాంబినేషన్లో ‘శౌర్య’ పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. సురక్ష ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎం.శివకుమార్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను కొద్దిసేపటి క్రితం హీరో మంచు మనోజ్ విడుదల చేశారు. శౌర్య అన్న క్లాస్ టైటిల్‌కు తగ్గట్లుగానే పోస్టర్స్ కూడా దశరథ్ స్టైల్ సినిమాను తలపిస్తూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రెండు పోస్టర్స్‌లో దర్శకుడు చూపించిన వైవిధ్యం కూడా చాలా బాగుంది. మంచు మనోజ్ ఇప్పటివరకూ కనిపించని ఓ సరికొత్త లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఓ సరికొత్త స్టోరీలైన్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో మనోజ్ సరసన రెజీనా హీరోయిన్గా నటిస్తుండగా గోపీ మోహన్ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చారు. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.