విడుదల తేది : 16 మార్చి 2012 |
123తెలుగు.కాం రేటింగ్: 2.5/5 |
దర్శకుడు : తిరు |
నిర్మాత : విక్రమ్ కృష్ణ |
సంగిత డైరెక్టర్ : యువన్ శంకర్ రాజ |
తారాగణం : విశాల్, తనుశ్రీదత్తా, నీతూచంద్ర, సారాజైన్ |
పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ హీరో విశాల్. ఆ సినిమా తరువాత చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినప్పటికీ తన వంతు ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా చేసిన సినిమానే ‘కిలాడి’. తమిళంలో 2 సంవత్సరాల క్రితం వచ్చిన ‘తీరాధ విలయాట్టు పిళ్ళై’ సినిమాని కిలాడి పేరుతో తెలుగులో డబ్ చేసారు. సారా జేన్ డయాస్, తనుశ్రీ దత్త, నీతూ చంద్ర హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి తిరు దర్శకత్వం వహించాడు. కిలాడి సినిమా ఈ రోజే ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదలవగా ఎలా ఉందొ చూద్దాం.
కథ:
బ్యాంకులో పనిచేసే సుధ, మౌళిల ఏకైక ముద్దుల కొడుకు కార్తీక్ (విశాల్). చిన్నప్పటి నుండి తనకు ఏదైనా మూడు ఆప్షన్స్ పెట్టుకొని అందులోనుండి బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడం అలవాటు. తనకు కాబోయే భార్యను కూడా అలాగే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటాడు. అదే ప్రయత్నంలో జ్యోతి (తనుశ్రీ దత్త), ప్రియ (సారా జేన్ డయాస్), తేజస్విని (నీతూ చంద్ర) అనే ముగ్గురు అమ్మాయిల్ని చూస్తాడు. ఆ ముగ్గురికి పరీక్ష పెట్టి తనకు సరిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నం మొదలు పెట్టిన కార్తీక్ కి ముగ్గురు ఐ లవ్ యు చెబుతారు. ఒకానొక సమయంలో కార్తీక్ ప్లాన్ గురించి తేజస్వినికి తెలిసిపోతుంది. మరి తేజస్విని ఏం చేసింది? మిగతా ఇద్దరు అమ్మాయిలకి కార్తీక్ గురించి తెలిసిందా? చివరికి కార్తీక్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఈ చిక్కుముడులన్ని వీడాలంటే కిలాడి చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
కార్తీక్ పాత్రలో విశాల్ ఎనర్జిటిక్ గా నటించాడు. డాన్సులు ఫైట్స్ కూడా బాగానే చేసాడు. పంజా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సారా జేన్ డయాస్ చూడటానికి అందంగా ఉంది. నెగటివ్ షేడ్స్ ఉన్న తేజస్విని పాత్రలో నీతూ చంద్ర బాగానే నటించింది. ఈ సినిమాలో ఆమె మొహమాటం లేకుండా అందాల ఆరబోత చేసింది. ఆమె మీద తీసిన ఒక హాట్ సాంగ్ ముందు వరుస ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చిత్ర మొదటి భాగం సరదా సన్నివేశాలతో సాగిపోతుంది. లవ్ మరియు కామెడీ సన్నివేశాలతో చిత్ర మొదటి భాగం బాగానే అనిపిస్తుంది. కార్తీక్ తల్లితండ్రులతో మరియు అతని స్నేహితుల మధ్య సన్నివేశాలు బాగానే నవ్విస్తాయి. సంతానం పాత్రకి అలీ డబ్బింగ్ బాగా నవ్విస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతంలో 2 పాటలు బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది.
మైనస్ పాయింట్స్:
విశాల్ నటన బావున్నప్పటికీ అతని లుక్ మాత్రం బాగాలేదు. అసలు కార్తీక్ పాత్ర డిజైన్ చేసిన విధానమే సరిగా లేదు. జీవితంలో స్థిరపడే ఉద్దేశం అంటూ లేకుండా ఇంటర్వ్యూ కి డుమ్మా కొట్టి పెళ్లి చేసుకోవడమే తన లక్ష్యం అంటూ అమ్మాయిల వెంట పడటం ఎంత వరకు సమంజసమో కథ రాసుకున్న దర్శకుడికే తెలియాలి. తను శ్రీ దత్త మేకప్ సరిగా లేక అందంగా లేకపోగా కనీసం నటనలో పాస్ మార్కులు కూడా సంపాదించుకోలేకపోయింది. ఆమె పై తీసిన సన్నివేశాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక సన్నివేశంలో హీరో లక్ష రూపాయల బైక్ కంటే ఆమె వేగంగా పరిగెత్తుతుంది. ఇలాంటివి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇక చిత్ర రెండవ భాగానికి వస్తే తరువాత జరగబోయే సన్నివేశాన్ని ప్రేక్షకుడు ముందే ఊహించే స్థాయిలో ఉన్నాయి. కథనంలో వేగం మందగించి సినిమా ఎప్పుడు ముగుస్తుందా అనే స్థాయికి తీసుకు వెళ్ళాడు. మధ్యలో సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడని రామిరెడ్డి (ప్రకాష్ రాజ్) పాత్రను తీసుకు వచ్చారు. విలక్షణ నటుడు అయిన ప్రకాష్ రాజ్ ఇలాంటి పాత్రలు అంగీకరించక పోవడమే మంచిది. క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే ఫైట్స్ చిరాకు తెప్పిన్స్తాయి. గతంలో తెలుగులో వచ్చిన ‘చుక్కల్లో చంద్రుడు’ మరియు ‘నా మనసిస్తా రా’ సినిమాల పోలికలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
సాంకేతిక విభాగం:
డబ్బింగ్ సినిమా కాబట్టి ఎడిటింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. చాలా సన్నివేశాల్లో జంప్ కట్స్ ఉన్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతం మాత్రం బావుంది. అరవింద్ కృష్ణ సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ బావుంది. నిర్మాణాత్మక విలువలు కూడా బావున్నాయి.
తీర్పు:
ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం తమిళంలో విడుదలైన సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నాం అంటూ ఇన్ని రోజులు ఆపి ఇప్పుడు విడుదల చేసారు. కానీ ఫలితం అదే స్థాయిలో ఉంది. ఈ సినిమా చూడటానికి ఎందుకు వచ్చారు అని ఒక సగటు ప్రేక్షకుడి ప్రశ్నిస్తే గత రెండు వారాలుగా సరైన తెలుగు సినిమాలు ఏమీ లేవు కాబట్టి అని సమాధానం ఇచ్చాడు.
123తెలుగు.కాం రేటింగ్ : 2.5/5
అశోక్ రెడ్డి
Clicke Here For ‘Khiladi’ English Review
Legend: