తెలుగులో ఇప్పటివరకు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి వంటి క్లాసిక్ సినిమాలు తీసిన దర్శకుడు కిశోర్ తిరుమల తొలిసారి తన పంథాకు భిన్నంగా థ్రిల్లర్ కథాంశంతో ‘రెడ్’ చిత్రాన్ని రూపొందించారు. రామ్ కథానాయకుడిగా స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో రెడ్ సినిమా, తన సినీ ప్రయాణ ముచ్చట్లు పంచుకున్నారు.
కిషోర్ మాట్లాడుతూ…నేను ఇప్పటివరకు ప్రేమ, స్నేహం, జీవితం విలువలు తెలిపే కథల్ని ఎంచుకొని సినిమాలు చేశాను. ‘రెడ్’ ద్వారా తొలిసారి క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌ను ప్రయత్నించాను. రామ్ తన కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రాభినయంలో నటించడం సినిమాలో ప్రధానాకర్షణగా ఉంటుంది. మాతృకలోని లైన్ మాత్రమే తీసుకొని సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని కొత్తగా రాశామని ఆయన చెప్పారు. అగ్ర కథానాయకులకు తగినట్లుగా కథలు రాసే స్థాయి నాకింకా రాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఎక్కువగా యువ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాను . వ్యక్తిగతంగా నాకు కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథా ఇతివృత్తాలు చాలా ఇష్టం. ఈ సినిమా తర్వాత శర్వానంద్, రష్మిక మందన్న జంటగా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే కుటుంబ కథా చిత్రాన్ని చేస్తున్నానన్నారు.
