మెగా ఫ్యామిలీ నుండి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ ఆదిలోనే అదరగొట్టేశాడు. ‘ఉప్పెన’తో ఏ డెబ్యూ హీరోకి దక్కని లాంఛ్ అందుకున్నాడు. మొదటి సినిమాతోనే ఈ స్థాయి హిట్ అందుకున్న హీరో ఎవ్వరూ లేరు. మొదట్లో మైత్రీ మూవీ మేకర్స్ ‘ఉప్పెన’ మీద అంత బడ్జెట్ పెట్టడం చూసిన చాలామంది ఒక డెబ్యూ హీరో మీద ఆ స్థాయిలో ఖర్చు పెట్టడం తెలివైన పని కాదని అన్నారు. కానీ సినిమా చూస్తే బ్లాక్ బస్టర్. ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు సినిమాకు 20 కోట్లకు పైగా బిజినెస్ జరగ్గా 21 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ పడింది.
అంత మొత్తం వెనక్కు రావడం సాధ్యమేనా అనుకుంటుండగా మొదటిరోజే హిట్ టాక్ తెచ్చుకుంది. అది మొదలు వసూళ్ల ఉప్పెన మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 47 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆ మొత్తం 51 కోట్లుగా ఉండగా టోటల్ గ్రాస్ 85 కోట్లని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అంటే లాభాలు 30 కోట్లకు పైనే. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాల్ని చూశారు. ఈ విజయంతో వైష్ణవ్ తేజ్ ఒకేసారి మీడియం రేంజ్ హీరోల జాబితాలోకి వెళ్ళిపోయాడు. ఆయన తర్వాతి సినిమాలన్నీ మంచి బడ్జెట్ సినిమాలే. ఆయన మీద 15 కోట్ల వరకు పెట్టుబడి పెట్టొచ్చని నమ్ముతున్నారు నిర్మాతలు.
