ప్రముఖ అగర్బత్తి బ్రాండ్ అంబికా సంస్థ తన సరికొత్త ఆవిష్కరణ ‘రాగస్వర సుప్రభాతం’ను ముక్కోటి ఏకాదశి పర్వదినాన మార్కెట్లోకి విడుదల చేసింది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారు ఈ నూతన ఉత్పత్తిని ఆవిష్కరించి, సంస్థ ప్రతినిధులకు ఆశీస్సులు అందజేశారు. 108 దివ్యదేశాల సముఖంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ, డైరెక్టర్లు అంబికా రామచంద్రరావు, కార్తీక్ ఆలపాటి పాల్గొన్నారు.
ఈ ‘రాగస్వర సుప్రభాతం’ అగర్బత్తి బాక్స్ అత్యంత వినూత్నంగా రూపొందించబడింది. భక్తులు ఈ బాక్స్‌ను తెరిచిన వెంటనే ఆటోమేటిక్‌గా ఐదు నిమిషాల పాటు ‘శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం’ వినిపించడం దీని ప్రత్యేకత. కేవలం పరిమళమే కాకుండా, శ్రవణానందాన్ని కలిగించే మ్యూజికల్ మెకానిజంతో దీనిని తయారు చేశారు. అగర్బత్తులు అయిపోయిన తర్వాత కూడా ఈ బాక్స్‌ను పూజా గదిలో మ్యూజిక్ ప్లేయర్‌గా వాడుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ, 125 ఏళ్లుగా నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్న అంబికా సంస్థ భక్తులకు భగవంతుడికి మధ్య అనుసంధానకర్తగా నిలిచిందని ప్రశంసించారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ, రామానుజాచార్యుల సన్నిధిలో ఈ ఉత్పత్తిని విడుదల చేయడం తమ అదృష్టమని పేర్కొన్నారు. త్వరలోనే వారం రోజులకు సరిపడా ఏడు రకాల సువాసనలతో కూడిన ప్యాక్‌లను కూడా విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఉత్పత్తులు త్వరలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ అందుబాటులోకి రానున్నాయి.
