శివమ్ మీడియా పతాకంపై రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘హ్రీం’ షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది. ధర్మార్ధ కామ మోక్షాల కలయిక అనే అర్థం వచ్చే ‘హ్రీం’ అనే శక్తివంతమైన బీజాక్షరం నేపథ్యంలో, ఒక యదార్థ గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజేష్ రావూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ తాత, డాక్టర్ చమిందా వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రం వరంగల్ సమీపంలోని పెద్ద పెండ్యాల గ్రామం మరియు హైదరాబాద్‌లోని హెచ్ఎంటీ కాలనీ ఫారెస్ట్ ఏరియాలో రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, బెనర్జీ వంటి సీనియర్ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్రీమతి సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.
