ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’.. అఫీషియల్ డేట్ ఫిక్స్..!

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి టాలీవుడ్‌లో ‘రీజనల్ ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది. మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది సరికొత్త చరిత్ర సృష్టించింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో మెరవడం విశేషం.

థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ మరియు బెంగాలీ వంటి మొత్తం ఏడు భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుండటం గమనార్హం. థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకే ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది.

షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమాకు ఓటీటీలో కూడా సాలిడ్ రెస్పాన్స్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Exit mobile version