ఏటూరునాగారంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓ రామయ్య కథ’

o

గోరంట్ల ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గోరంట్ల సత్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓటీటీ చిత్రం ‘ఓ రామయ్య కథ’. ములుగు జిల్లా ఏటూరునాగారం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఏటూరునాగారం, రామన్న గూడెం, చిన్నబోయినపల్లి, ఆకులవారి ఘణపురం తదితర ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ జరిపారు.

ఈ చిత్రంలో సీనియర్ నటుడు అశోక్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తుండగా, హీరోయిన్‌గా అదితి పరిచయమవుతున్నారు. సినిమా రంగంలో రౌడీ పాత్రల్లో రాణిస్తున్న రామన్న గూడెం వాసి రాంబాబుతో పాటు శ్రీధర్ స్వామి, పుష్పలత, హస్సేన్, వరంగల్ పూర్ణ చందర్, శర్మ తదితరులు ఇందులో నటించారు. వీరితో పాటు ఏటూరునాగారంకు చెందిన పలువురు స్థానిక ఔత్సాహిక నటీనటులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు.

“చనిపోయాక పిండం పెట్టడం కాదు.. బతికున్నప్పుడే ఇంత అన్నం పెట్టండి” అనే బలమైన సామాజిక సందేశంతో ఈ చిత్రం రూపొందుతోంది. గుండెల్ని పిండేసే కథాంశంతో సినిమాను తీర్చిదిద్దామని, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ప్రముఖ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దర్శకుడు గోరంట్ల సత్యం తెలిపారు.

Exit mobile version