మాస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా, తెలుగు నిర్మాతలు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఆంగ్ల చిత్రం ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ (A Beautiful Breakup). తక్ష్, మటిల్డా జంటగా నటించిన ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌ను అజిత్ వాసన్ ఉగ్గిన తెరకెక్కించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండగా, ఫిబ్రవరి 12న దుబాయ్‌లో ప్రత్యేక ప్రీమియర్ జరగనుంది.
5 నేచర్స్ మూవీస్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందిన ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లీష్‌లో తీశామని, ఇళయరాజా గారి ఆర్కెస్ట్రల్ స్కోర్ సినిమాకు ఆత్మలాంటిదని తెలిపారు. విడిపోవడం కూడా అందంగా, ఆనందంగా ఉండొచ్చనే విభిన్నమైన పాయింట్‌తో ఈ కథ నడుస్తుందన్నారు. కర్ణాటకలోని చిక్కమగళూరు అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ, యూకేలో చేసిన కలర్ గ్రేడింగ్ హైలైట్‌గా నిలుస్తాయని హీరో తక్ష్ పేర్కొన్నారు.
సాధారణ దెయ్యం కథలా కాకుండా, ఒక పవిత్రమైన ఆత్మ చుట్టూ తిరిగే ఈ కథను త్వరలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేయనున్నారు. అలాగే జపాన్, యూకే, యూఎస్ఏ వంటి దేశాల్లోనూ దశలవారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
