ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ (Allu Cinemas) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గురువారం (మార్చి 12) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ థియేటర్‌ను లాంచ్ చేశారు. ఇండియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా (Dolby Cinema) స్క్రీన్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ థియేటర్ ప్రత్యేకత. పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాలతో ఈ సరికొత్త థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. సినీ పరిశ్రమకు ఎంతో అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్. ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అనుభూతిని పంచాలనే ఉద్దేశంతోనే ఎంతో ఉన్నతంగా ఈ అల్లు సినిమాస్‌ను డిజైన్ చేశాం” అని బన్నీ తెలిపారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు..
అల్లు సినిమాస్ వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని బన్నీ వివరిస్తూ.. “మాకు ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ఇదొక ప్యాషన్ ప్రాజెక్ట్. సినిమా ఇండస్ట్రీ మాకు ఎంతో ఇచ్చింది, తిరిగి ఇండస్ట్రీకి ఏదైనా మంచి చేయాలనే తపనతోనే ఈ అడుగు వేశాం” అని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో తన తండ్రి అల్లు అరవింద్ గొప్పదనాన్ని బన్నీ గుర్తుచేసుకున్నారు. ఆమిర్ ఖాన్ ‘గజినీ’ సినిమాతో వంద కోట్ల వసూళ్లు సాధించి, హోమ్ టెరిటరీలో ఇండియన్ సినిమా సత్తా చాటిన లెజెండ్ తన తండ్రి అని కొనియాడారు. “చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. నాన్నగారు టెక్నాలజీ అప్డేట్స్ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. స్టీరియో సౌండ్ నడుస్తున్న రోజుల్లోనే ‘మాస్టర్’ సినిమాతో సరౌండ్ 5.1ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఫిల్మ్ ఫార్మాట్ నుంచి డిజిటల్ వైపు తెలుగు సినిమా అడుగులు వేయడానికి ఆయనే ప్రధాన కారణం. తెలుగులో తొలి ఓటీటీ ‘ఆహా’ తీసుకొచ్చింది కూడా ఆయనే. ఆయన కేవలం నాన్న మాత్రమే కాదు, తెలుగు సినిమా డిజిటల్ ఎరాకు ఫాదర్. ఈ అల్లు సినిమాస్ ద్వారా ఆయన్ని గర్వపడేలా చేస్తామని ఆశిస్తున్నా” అంటూ బన్నీ ముగించారు.
