ఆకట్టుకుంటున్న ‘సైన్మా స్టూడియోస్’ మూవీ పోస్టర్.. అన్నాచెల్లెళ్ల బంధం నేపథ్యమా?

v 1

ప్రముఖ న్యాయవాది, ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర సమర్పకులు డాక్టర్ నాగేశ్వరరావు పూజారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నూతన చిత్రాన్ని ప్రకటించారు. తన సొంత బ్యానర్ ‘సైన్మా స్టూడియోస్’పై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పీవీఎన్ కార్తికేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

నిర్మాత బర్త్‌డే కానుకగా చిత్ర బృందం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఒక అమ్మాయి కంటిలో అన్నాచెల్లెళ్లు సైకిల్‌పై వెళ్తున్న దృశ్యాన్ని ఈ పోస్టర్‌లో చూపించారు. “ప్రకృతి మనకు ఇచ్చిన స్నేహితుడు మన సోదరుడు.. కానీ ఆ బంధం మధ్యలో అహం అనే అడ్డుగోడలు మనమే నిర్మించుకున్నాం” అనే క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అన్నాచెల్లెళ్ల బంధం, మానవ సంబంధాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని, మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అతి త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు.

Exit mobile version