మరోసారి చేతులు కలపనున్న ‘జై భీమ్’ కాంబో.. ఈసారి కూడా అదే రూట్..?

Jai Bhim

తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో ‘జై భీమ్’ ఒక మైలురాయిగా నిలిచిపోయింది. కరోనా మహమ్మారి కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైనప్పటికీ, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం, సూర్య మరియు దర్శకుడు టీజే జ్ఞానవేల్ మరోసారి చేతులు కలపబోతున్నారు. జ్ఞానవేల్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, ఇది కూడా ఒక యథార్థ సంఘటనల ఆధారంగా సాగే రియలిస్టిక్ మూవీ అని తెలుస్తోంది.

​ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సూర్య సొంత నిర్మాణ సంస్థ ‘జగరం స్టూడియోస్’ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ‘జై భీమ్’ తర్వాత రజనీకాంత్‌తో టీజే జ్ఞానవేల్ చేసిన ‘వెట్టయాన్’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈ కొత్త సినిమాతో ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని దర్శకుడు పట్టుదలతో ఉన్నాడట.

​మరోవైపు, సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘కరుప్పు’ మరియు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాల షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ రెండు సినిమాలు కేవలం మూడు నెలల గ్యాప్‌లో విడుదల కానున్నాయి. ప్రస్తుతం ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో తన 47వ సినిమా షూటింగ్‌లో సూర్య పాల్గొంటున్నాడు. ఈ షెడ్యూల్స్ ముగిసిన తర్వాత జ్ఞానవేల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

Exit mobile version