నటి మాళవిక మోహనన్‌కు ఒక చేదు అనుభవం ఎదురైంది. పబ్లిసిటీ మరియు సంచలనం కోసం ఒక జర్నలిస్ట్ పరిధులు దాటి, నటుడు మరియు ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ మాళవికను ఓ ప్రశ్న అడిగాడు. “విజయ్ సార్ వెళ్లే ప్రతి చోటుకీ త్రిష కూడా వస్తున్నారు, దీనిపై మీకేమైనా ఐడియా ఉందా?” అని సంబంధం లేని ప్రశ్నను అడిగాడు. ఈ చౌకబారు ప్రశ్నపై మాళవిక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆ తర్వాత ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయంపై ఘాటుగా స్పందించింది. కేవలం రేటింగ్స్ కోసం కొంతమంది జర్నలిస్టులు ఇలాంటి అసభ్యకరమైన, అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారని మండిపడింది. విజయ్ తనకు గత ఏడేళ్లుగా తెలుసని, ఆయనపై తనకు ఎంతో గౌరవం ఉందని, ఆయన్ని ఒక మంచి స్నేహితుడిగా భావిస్తానని చెప్తూ.. భవిష్యత్తులో మీడియా సమావేశాలు గౌరవప్రదంగా, అర్థవంతంగా సాగాలి కానీ, ఇలాంటి గాసిప్‌ల చర్చలుగా మారకూడదని తెలిపింది.
గతంలో విజయ్‌తో కలిసి ‘మాస్టర్’ సినిమాలో నటించిన మాళవిక, రీసెంట్గా ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’ చిత్రంలో కనిపించింది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఎథిక్స్ వదిలేసి ఇలాంటి వెకిలి ప్రశ్నలు వేసిన సదరు జర్నలిస్ట్ తీరుపై నెటిజన్లు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు.
