టాలీవుడ్ పంపిణీ రంగంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, డబ్బింగ్ చిత్రాల నిర్మాత గుజ్జలపూడి హరి నేడు ఉదయం గుండెపోటుతో చనిపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన కేవలం 47 ఏళ్ల వయసులోనే ఇలా ఆకస్మికంగా దూరమవ్వడం సినిమా పంపిణీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తెలుగు అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతీ మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, శ్రేష్ఠ మూవీస్ వంటి బ్యానర్ల నుండి వచ్చిన ఎన్నో భారీ చిత్రాలను గుజ్జలపూడి హరి నెల్లూరు ఏరియాలో పంపిణీ చేసి సక్సెస్ అయ్యారు.
పైగా గుజ్జలపూడి హరికి అగ్ర నిర్మాతలతో బలమైన సంబంధాలను ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తూనే, ‘హరి వెంకటేశ్వర పిక్చర్స్’ అనే బ్యానర్‌ను స్థాపించి, తమిళ చిత్రాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. హరి మరణవార్త వినగానే అక్కినేని నాగార్జున పోస్ట్ చేస్తూ “గుజ్జలపూడి హరికుమార్ గారి మరణవార్త నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టింది’ అంటూ నాగార్జున సంతాపం వ్యక్తం చేశారు. మా 123తెలుగు.కామ్ తరఫున గుజ్జలపూడి హరి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
