‘జైలర్ 2’లో టాప్ హీరో ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు పూనకాలే..?

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ‘జైలర్ 2’ విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిజానికి ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పట్టేలా ఉండటంతో వాయిదా వేశారు. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకుంటూ సూర్య తన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాన్ని అదే తేదీకి లాక్ చేసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ‘జైలర్ 2’ వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఈ సినిమాలో ముత్తువేల్ పాండియన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కోసం ప్లాన్ చేస్తున్న భారీ క్యామియోలే ఆలస్యానికి ప్రధాన కారణం అవుతున్నాయి. ఈ ప్రత్యేక పాత్రల కోసం తొలుత నందమూరి బాలకృష్ణను సంప్రదించగా, ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, ‘కింగ్’ సినిమా బిజీ వల్ల ఆయన డేట్స్ దొరకలేదు. ప్రస్తుతం 40 ఏళ్ల క్రితం ‘భగవాన్ దాదా’ చిత్రంలో రజనీతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన హృతిక్ రోషన్ కోసం మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే సాధారణంగా గెస్ట్ రోల్స్‌కు దూరంగా ఉండే హృతిక్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సీక్వెల్‌ను పూర్తి చేసిన వెంటనే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కు మరో భారీ బాధ్యత ఎదురుచూస్తోంది. లోకనాయకుడు కమల్ హాసన్ – సూపర్ స్టార్ రజినీకాంత్ ల క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని ఆయన తెరకెక్కించాల్సి ఉంది. ఇద్దరు దర్శకులు మారిన తర్వాత నెల్సన్ చేతికి వచ్చిన ఈ ప్రాజెక్ట్ వల్ల ఆయనపై ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఒకవేళ ‘జైలర్ 2’ గనుక బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటే, ఈ అల్టిమేట్ మల్టీస్టారర్ ప్రాజెక్టుకు మరింత ఊపు రావడం ఖాయం.

Exit mobile version