భాష, నటీనటులతో సంబంధం లేకుండా మంచి కంటెంట్‌ను ప్రోత్సహించే హైదరాబాద్‌లో ప్రస్తుతం ఒక్క ఐమాక్స్ స్క్రీన్ కూడా లేకపోవడం మూవీ లవర్స్‌ను ఎప్పటి నుంచో నిరాశపరుస్తోంది. గతంలో ప్రసాద్స్ థియేటర్స్‌లో ఐమాక్స్ స్క్రీన్ ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల దాన్ని తీసివేశారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ సినీ అభిమానులకు ఊరటనిచ్చే క్రేజీ అప్డేట్ వచ్చేసింది. నగరంలో సరికొత్త ఐమాక్స్ స్క్రీన్ రాబోతున్నట్లు ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ నారంగ్ ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. తమ ఏషియన్ గ్రూప్‌కు చెందిన ఒక ప్రాపర్టీలో దీనిని ఏర్పాటు చేయబోతున్నామని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో నాలుగు, ఐదు రోజుల్లో రానుందని ఆయన వెల్లడించారు.
సాధారణ స్క్రీన్ల కంటే ఐమాక్స్ స్క్రీన్లు అద్భుతమైన విజువల్స్, బ్రైట్నెస్, మరియు సుపీరియర్ సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. డిజిటల్ ఐమాక్స్ ఫార్మాట్ (1.90:1) సాధారణ స్క్రీన్ల కంటే 26 శాతం ఎక్కువ ఇమేజ్ ఏరియాను చూపిస్తే.. ఐమాక్స్ 70mm (1.43:1) ఫార్మాట్ మరింత ఎత్తుగా ఉంటూ ప్రేక్షకుడికి థియేటర్లోనే లీనమైపోయే సరికొత్త అనుభూతిని ఇస్తుంది. హైదరాబాద్‌లో మళ్లీ ఐమాక్స్ రాబోతుండటంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
