వచ్చే గురువారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక భారీ ప్రకంపన సృష్టించేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సిద్ధమవుతోంది. ఇటీవలి కాలంలో అత్యంత భారీ అంచనాలతో వస్తున్న చిత్రాల్లో ఇది ఒకటి కావడంతో, సోషల్ మీడియా వేదికగా సినిమాపై రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా టెక్నికల్ అంశాలపై, అందునా మ్యూజికల్ ఆస్పెక్ట్ పై సినీ లవర్స్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోవడమే ఈ చర్చకు ప్రధాన కారణం.
దర్శకుడు బుచ్చిబాబు సానా తొలి చిత్రం ‘ఉప్పెన’ సాధించిన సంచలన విజయంలో సంగీతానిదే పెద్దపీట అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన పాటలు, ప్రాణం పెట్టే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను సింగిల్ హ్యాండ్‌తో నడిపించాయి. విజువల్స్ పరంగా సినిమా ఎంత రిచ్‌గా ఉన్నప్పటికీ, డీఎస్పీ అందించిన ఆడియో ట్రాక్స్ ఆ విజువల్స్‌ను ప్రేక్షకుల గుండెల్లోకి తీసుకెళ్లాయి. సినిమా విడుదలకు ముందే ప్రతి పాట ఒక ఎమోషన్‌గా మారి, సినిమాకు భారీ హైప్ తెచ్చిపెట్టింది.
అయితే ‘ఉప్పెన’తో పోలిస్తే ‘పెద్ది’ విషయంలో విడుదలకు ముందు ఆ స్థాయి మ్యూజికల్ హైప్ కనిపించడం లేదనేది ట్రేడ్ వర్గాల విశ్లేషణ. ఈ సినిమాలో ‘చికిరి’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి యూట్యూబ్, రీల్స్‌ను షేక్ చేసింది. కానీ, ఒక్క పాట మినహాయిస్తే ఆల్బమ్‌లోని మిగతా పాటలు ‘ఉప్పెన’ స్థాయిలో దూసుకెళ్లలేదు. ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఆడియో పరంగా థియేటర్లలోకి వెళ్లకముందే రావాల్సిన ఇంపాక్ట్ ఇంకాస్త రావాల్సి ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తం భారమంతా ఏఆర్ రెహమాన్ భుజాలపైనే పడింది. సినిమా విడుదలకు ముందు ఆడియో పరంగా ఉన్న తక్కువ బజ్‌ను, థియేటర్లలో తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో రెహమాన్ భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్పోర్ట్స్ డ్రామాల్లో ఎమోషన్స్ పీక్స్‌కు వెళ్లాలన్నా, థియేటర్లలో ప్రేక్షకులు ఎంటర్టైనింగ్ అనుభూతిని పొందాలన్నా మ్యూజిక్ అత్యంత కీలకం. కొంతకాలంగా సరైన ఫామ్‌లో లేని ఈ లెజెండరీ కంపోజర్ ‘పెద్ది’ కోసం థియేటర్లలో తన విశ్వరూపం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డైరెక్టర్ బుచ్చిబాబు సానా డీఎస్పీని కాదని రెహమాన్ లాంటి వెటరన్ లెజెండ్ వైపు మొగ్గు చూపాడంటే, ఆయన కథలో మ్యూజిక్కు అంత స్కోప్ ఉండి ఉండాలి. ఇప్పుడు థియేటర్లలో రెహమాన్ ఇచ్చే అవుట్పుట్టే బుచ్చిబాబు నమ్మకాన్ని, ఆయన ఎంపికను జస్టిఫై చేయాలి. ‘ఉప్పెన’ను దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో ఎలాగైతే నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాడో, అంతకంటే భారీ క్యాన్వాస్‌తో వస్తున్న ‘పెద్ది’ని రెహమాన్ తన మ్యాజికల్ స్కోర్‌తో నిలబెట్టాల్సి ఉంది. మరి వచ్చే గురువారం ఈ ఆస్కార్ విజేత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సౌండ్ చేస్తారో చూడాలి.
