హారర్ కామెడీ థ్రిల్లర్‌గా ఎస్తర్ కొత్త సినిమా

ఎస్త‌ర్ నోరోన్హా, నూపూర్ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో ఎస్.కె. గోపాల్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం సోమవారం మణికొండ శివాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. బ్లూ రే సర్క్యూట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తొలి సన్నివేశానికి నిర్మాత సురేష్ కొండేటి క్లాప్ ఇవ్వగా, నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ చైర్మన్ ఎస్.వి.ఎన్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మాజీ మంత్రి వేణుగోపాలచారి చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు.

​హారర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు ఎస్.కె. గోపాల్, నిర్మాత అభినంద తెలిపారు. ఇందులో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారని వెల్లడించారు. ఇప్పటికే హీరోగా పవన్, హీరోయిన్లుగా ఎస్తర్, నూపుర్ ముఖర్జీ, సంధ్యలను ఎంపిక చేయగా, మిగతా నటీనటుల ఎంపిక జరుగుతోందని పేర్కొన్నారు. జూన్ రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

​ప్రస్తుతం లొకేషన్ల ఎంపికతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాటలు ఇప్పటికే రికార్డింగ్ దశలో ఉన్నాయని చిత్ర బృందం తెలిపింది. అభినంద దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం అందిస్తుండగా, మను, ప్రసాద్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Exit mobile version