దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల టెలివిజన్, ఓటీటీ నిర్మాతలు ఏకమై ‘టెలివిజన్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’ (టాప్కాస్)ను అధికారికంగా ఏర్పాటు చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన నిర్మాతల మండళ్లు సమన్వయంతో ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి. ఇటీవల చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో సంస్థ నూతన నిబంధనావళిని (బైలాస్) ప్రకటించారు. ఈ ఉమ్మడి వేదికకు అధ్యక్షుడిగా ఏ. ప్రసాద్ రావు వ్యవహరించనున్నారు.
గత కొన్నేళ్లుగా రాష్ట్రాల మధ్య షూటింగ్‌లు, నటీనటులు, సాంకేతిక నిపుణుల మార్పిడి పెరగడంతో ఉమ్మడి కౌన్సిల్ అవసరం ఏర్పడిందని ప్రసాద్ రావు తెలిపారు. ఆయా భాషల వర్కింగ్ కల్చర్, బడ్జెట్, రెమ్యునరేషన్లలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ.. నిర్మాతల హక్కుల రక్షణ, ఉమ్మడి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టాప్కాస్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. తెలుగు టీవీ నిర్మాతల మండలిని ఆదర్శంగా తీసుకుని, రెండేళ్లుగా జరిపిన చర్చల అనంతరం ఈ వేదిక రూపుదిద్దుకుందని ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ఉదయ్ శంకర్, సునీల్ కుమార్, కృష్ణన్ సేతుకుమార్ వెల్లడించారు.
నిర్మాతలకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించుకోవడంతో పాటు, ప్రభుత్వాల నుంచి అవసరమైన సదుపాయాలు కల్పించేలా ఈ సంస్థ చొరవ తీసుకోనుంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్న నిర్మాతలను కలుపుతూ ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్’ ఏర్పాటు చేయడమే తమ తదుపరి లక్ష్యమని బృందం ప్రకటించింది. టాప్కాస్ నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా ఉదయ్ శంకర్, అరవింద్, జి. జయకుమార్, జనరల్ సెక్రటరీగా రాజావేలు, ట్రెజరర్‌గా డి.వై. చౌదరి బాధ్యతలు స్వీకరించారు.
