ఆకట్టుకుంటున్న ‘ఇసకపట్నం’ ట్రైలర్.. ప్రైమ్ వీడియోలో జూలై 2 నుంచి స్ట్రీమింగ్..!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియో తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేసింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తమడా మీడియా నిర్మించిన ఈ ఏడు ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్‌లో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించగా.. సునీల్, నరేష్ అగస్త్య, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ … “ఇసకపట్నం ఒక కల్పిత ప్రపంచంలో సాగే కథ అయినప్పటికీ, ఇందులో పాత్రలు, వారి భావోద్వేగాలు చాలా నిజాయితీగా ఉంటాయి. ఆశ, ప్రేమ, కోల్పోవడం, ప్రతీకారం వంటి అంశాలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురిచేసే ఎన్నో ట్విస్టులు ఇందులో ఉన్నాయి” అని తెలిపారు.

సముద్రఖని మాట్లాడుతూ… “ఈ కథలోని బలమైన భావోద్వేగాలు, నా పాత్రలో ఉన్న వైవిధ్యాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అధికారం, ప్రతీకారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళ్తారనే విషయాన్ని ఈ కథ బలంగా చూపిస్తుంది. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఒక భిన్నమైన పాత్రను ఇందులో పోషించాను” అన్నారు.

ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ… “అధికారం, సంఘర్షణలతో నిండిన ప్రపంచంలో తనదైన నిర్ణయాలతో ముందుకు సాగే భారతి అనే ధైర్యవంతురాలైన మహిళా పాత్రలో నేను కనిపిస్తాను. ఆత్మవిశ్వాసం, భావోద్వేగాలు కలగలిసిన ఈ పాత్రను పోషించడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్ తదితరులు పాల్గొని మాట్లాడారు. మరి జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ‘ఇసకపట్నం’ ప్రేక్షకులను ఎంతమేర అలరిస్తుందో చూడాలి.

Exit mobile version