‘వంద దేవుళ్ళు’ ఎమోషనల్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ – నిహారిక కొణిదెల

విజయ్ ఆంటోని హీరోగా దర్శకుడు శశి రూపొందించిన కొత్త చిత్రం ‘వంద దేవుళ్ళు’. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోమవారం చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల, దర్శకుడు త్రినాథరావు నక్కిన హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. తాను ఇప్పటికే ఈ సినిమా చూశానని, మాతృత్వం నేపథ్యంలో తెరకెక్కిన ఈ కథ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుందని తెలిపారు. ‘బిచ్చగాడు’ కంటే ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు. హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం ‘బిచ్చగాడు’తో తనకు హీరోగా కొత్త జీవితం ఇచ్చిన శశి గారితో మరోసారి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కథ విన్నప్పుడు తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ఆయన వెల్లడించారు.

తల్లిని దేవతలా చూపిస్తే అది ‘బిచ్చగాడు’ అని, అదే తల్లిని ఒక సాధారణ మనిషిగా చూపిస్తే ‘వంద దేవుళ్ళు’ అని దర్శకుడు శశి సినిమా థీమ్‌ను వివరించారు. ఈ చిత్రంలో స్వాసిక, లిజోమోల్ జోస్, కావ్య అనిల్, అజయ్ కీలక పాత్రలు పోషించారు. బాలాజీ శ్రీరామ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version