పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడి’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. మైథాలజీ టచ్‌తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటించడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు ఈ చిత్ర సీక్వెల్‌ను సిద్ధం చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొనె తప్పుకున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారా అనే విషయంపై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఈ సీక్వెల్ చిత్రంలో మరో బాలీవుడ్ భామ ఆలియా భట్ జాయిన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్లో కనిపిస్తుందని సినీ సర్కిల్స్ టాక్.
అంతేగాక, ఆలియా భట్ ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆలియా భట్ నిజంగానే కల్కి సీక్వెల్ మూవీలో నటిస్తుందా..? ఆమె ఇందులో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందా..? అనే ప్రశ్నలు అభిమానుల్లో నెలకొన్నాయి. మరి ఈ విషయంపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
