మురళీమోహన్‌కు నరెడ్కో ఆత్మీయ సన్మానం.. హాజరైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్

NAREDCO Felicitates Murali Mohan

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త మురళీమోహన్‌ను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఘనంగా సత్కరించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా, రాజకీయం, వ్యాపార రంగాల్లో మురళీమోహన్ సాధించిన విజయం, ఆయన పాటించిన క్రమశిక్షణ ఎంతోమందికి ఆదర్శమని స్పీకర్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో నరెడ్కో ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొప్పుల, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ప్రముఖ బిల్డర్ డీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. మురళీమోహన్ రియల్ ఎస్టేట్ రంగానికి అందించిన దిశానిర్దేశాన్ని, ఆయన చేసిన సామాజిక సేవలను వక్తలు గుర్తుచేసుకున్నారు. వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకునేలా అసోసియేషన్‌ను స్థాపించి, పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

తనకు లభించిన ఈ సత్కారంపై మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు. నరెడ్కో సభ్యులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తానని చెప్పారు. దివంగత నటుడు శోభన్ బాబు ఇచ్చిన సలహాతోనే తాను రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించారు. కస్టమర్లను దేవుడిలా భావించే సంస్కృతిని నరెడ్కో ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్, అమరావతి నగరాలు మరింతగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

Exit mobile version