‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల

జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు నవీన్‌ దేశబోయిన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’. నమో జయం ప్రొడక్షన్స్‌ పతాకంపై దివ్య ప్రవీణ్‌ బొలిశెట్టి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. జాతీయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయురాలు మారం పవిత్ర ముఖ్య అతిథిగా హాజరై ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ చిత్రం మలయాళంలో విజయవంతమైన ‘ఫిలిప్‌ అండ్‌ ది మంకీ పెన్‌’ చిత్రానికి రీమేక్‌ అని దర్శకుడు నవీన్‌ దేశబోయిన తెలిపారు. కుటుంబ భావోద్వేగాలతో పాటు ప్రస్తుత విద్యావ్యవస్థ, విద్యార్థులు పాఠశాలల్లో ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది.

జయంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి తాతగా, సత్యం రాజేష్‌ స్కూల్‌ టీచర్‌గా కీలక పాత్రలు పోషించారు. ఆశిష్‌ గాంధీ, కాశీ విశ్వనాథ్, మానస రాధాకృష్ణన్‌ ఇతర పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి ప్రవీణ్‌ బొలిశెట్టి మాటలు, పాటలు అందించగా, మోహిత్‌ కులకర్ణి సంగీతం సమకూర్చారు. సినిమాటోగ్రఫీని ఆండ్రూ బాబు, ఎడిటింగ్‌ బాధ్యతలను నందమూరి హరి తారక రామారావు నిర్వహించారు.

Exit mobile version