కార్తీ ‘సర్దార్ 2’ బాక్సాఫీస్: తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ లేక పలు మల్టీప్లెక్సుల్లో షోలు రద్దు!

తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ కలయికలో వచ్చిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సర్దార్’ తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించడంతో, ఈ సీక్వెల్‌పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే ఆశించిన బజ్ తీసుకురాలేకపోయింది.

వెలవెలబోతున్న మల్టీప్లెక్స్‌లు.. రద్దవుతున్న షోలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ‘సర్దార్ 2’కు దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం, మధ్యాహ్నం ఆటలకు కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులు రాకపోవడంతో టికెట్ కౌంటర్లు బోసిపోయాయి. పలు మల్టీప్లెక్స్ స్క్రీన్లలో నిబంధనల ప్రకారం షో వేయడానికి సరిపడా సంఖ్యలో కూడా బుకింగ్స్ లేకపోవడంతో యాజమాన్యాలు షోలను రద్దు చేస్తున్నాయి. కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్, మొదటి రోజు కలెక్షన్స్ ఊహించని రీతిలో డల్ అయ్యాయి.

కారణం ఇదేనా?

ఈ చిత్రానికి ప్రచార లోపం ఒక కారణమైతే, మొదటి భాగాన్ని మించేలా స్క్రీన్‌ప్లేను రేసీగా నడపడంలో దర్శకుడు తడబడ్డారనే టాక్ బలంగా వ్యాపించింది. దాదాపు మూడు గంటల నిడివి ఉండటం, ద్వితీయార్థంలో డ్రామా తేలిపోవడం ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఎస్.జె. సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ వంటి క్రేజీ నటీనటులు ఉన్నప్పటికీ, మిశ్రమ సమీక్షలు రావడంతో సాధారణ ప్రేక్షకులు థియేటర్ల వైపు చూడటం లేదు. దీనితో వీకెండ్‌లోగా మౌత్ టాక్ పుంజుకోకపోతే బాక్సాఫీస్ వద్ద సినిమా నిలబడటం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Exit mobile version