8 రోజుల్లో రూ. 223 కోట్లు: కొత్త సినిమాలొచ్చినా తగ్గని క్రేజ్.. ‘మిర్జాపూర్ ది మూవీ’ బాక్సాఫీస్ ర్యాంపేజ్

ఓటీటీలో సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ ఫ్రాంచైజీ వెండితెరపై కూడా బాక్సాఫీస్ వద్ద అదే స్థాయి ప్రభంజనం సృష్టిస్తోంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మిర్జాపూర్ ది మూవీ’ థియేటర్లలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. విడుదలైన 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ. 223.04 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సాలిడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

శాక్‌నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 6,762 షోలతో ఈ చిత్రం 8వ రోజు దాదాపు రూ. 9 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 157.45 కోట్లకు చేరుకోగా, ఇండియా గ్రాస్ విలువ సుమారు రూ. 187.54 కోట్లకు చేరింది. దీనికితోడు ఓవర్‌సీస్‌లోనూ రూ. 35.50 కోట్ల గ్రాస్ సాధించడంతో వరల్డ్‌వైడ్‌గా రూ. 223 కోట్లను దాటేసింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ హీరోలుగా వచ్చిన ‘హైవాన్’ థియేటర్లలోకి అడుగుపెట్టినప్పటికీ ‘మిర్జాపూర్’ జోరుకు ఎక్కడా బ్రేకులు పడలేదు.

వెండితెరపై ‘మిర్జాపూర్’ మ్యాజిక్

గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో పునీత్ కృష్ణ రాసిన ఈ చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రితీష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. వెబ్ సిరీస్ మొదటి సీజన్ 6, 7 ఎపిసోడ్‌ల మధ్య సాగే పరిణామాల నేపథ్యంలో కథను నడిపించారు. సిరీస్‌లో ప్రాణాలు కోల్పోయిన మున్నా త్రిపాఠి (దివ్యేందు), గోలు గుప్తా (శ్వేతా త్రిపాఠి) పాత్రలు ఇందులో మళ్లీ కనిపించడం అభిమానులను థియేటర్ల వైపు రప్పిస్తోంది. పంకజ్ త్రిపాఠి ‘కాలీన్ భయ్యా’గా, అలీ ఫజల్ ‘గుడ్డు పండిట్’గా తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Exit mobile version