యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయడానికి కాస్త సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. “ఒక్క సినిమా కోసం ఏకంగా 175 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేయడం, అందులో దాదాపు 2,500 వీఎఫ్‌ఎక్స్ (VFX) షాట్స్ ఉంటాయని నేనెప్పుడూ ఊహించలేదు” అంటూ నిఖిల్ తన అనుభవాన్ని పంచుకున్నారు. భారీ విజువల్స్‌తో ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ ఇస్తామని ఆయన కాన్ఫిడెంట్‌గా చెప్పారు.
ప్రస్తుతం షూటింగ్‌తో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపు దశకు వచ్చాయి. త్వరలోనే ‘స్వయంభు’ అధికారిక విడుదల తేదీని ప్రకటిస్తామని నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.
