ఆంధ్రప్రదేశ్లో కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డులను ప్రదానం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్, ఎండీ విశ్వనాథన్ వెల్లడించారు. సినిమా, టీవీ, నాటక రంగాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న పురస్కారాలను అందజేయనున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు.
2012 నుంచి 2016 వరకు ఇప్పటికే ప్రకటించిన నంది అవార్డులను అందజేస్తారు. ఇందులో భాగంగా సినిమా విభాగానికి సంబంధించి సుమారు 288 అవార్డులు, 51 జ్యూరీ అవార్డులు, టీవీ విభాగానికి 330 అవార్డులు, 54 జ్యూరీ అవార్డులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి బహుమతి ప్రదానం చేయనున్నారు.
ఇక 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏట నాలుగు అవార్డుల చొప్పున ఇవ్వనున్నారు. అందులో ఫస్ట్ బెస్ట్, సెకండ్ బెస్ట్ సహా రెండు జ్యూరీ అవార్డులు ఉంటాయి. 2025 సంవత్సరానికి పూర్తిస్థాయిలో నంది అవార్డులు అందజేస్తామని అధికారులు తెలిపారు. అలాగే పెండింగ్లో ఉన్న ఎన్టీఆర్ అవార్డులను డిసెంబర్ 25 నాటికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి, అక్టోబర్ 12 నాటికి దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ రెండో వారంలో జ్యూరీ కమిటీని వెల్లడిస్తామని భరత్ భూషణ్ తెలిపారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి సింగిల్ విండో విధానాన్ని మరో 20 నుంచి 30 రోజుల్లో ప్రకటించనున్నట్లు చెప్పారు. సినీ అవార్డుల ప్రధానోత్సవాన్ని అమరావతి ప్రాంతంలో, టీవీ అవార్డుల కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించనున్నట్లు ఎండీ విశ్వనాథన్ పేర్కొన్నారు.
