అక్టోబర్ 2న థియేటర్లలోకి ‘ఇంప్యూర్’.. సంగీత దర్శకురాలిగా రాజా కుమారి పరిచయం

వారాహి మల్లిపాముల, శ్రీదేవి మల్లిపాముల నిర్మించిన చిత్రం ‘ఇంప్యూర్’. నిశాంతి ఇవని దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన పాత్రలు పోషించగా, ఇటీవల చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ చిత్రానికి వారాహి స్వయంగా కథను సమకూర్చారు.

ఈ సినిమాతో సింగర్, ర్యాపర్ రాజా కుమారి సంగీత దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఆమె కరణ్ పాండవ్‌తో కలిసి చిత్రానికి సంగీతం అందించడంతో పాటు ‘ఓఎంజీ’ (ఓ మై గాడ్) అనే గీతాన్ని ఆలపించారు. కడలి సత్యనారాయణ సాహిత్యం అందించిన ఈ పాటతో పాటు సినిమాలో మరో పాటను కూడా రాజా కుమారి పాడారని, ఓ ప్రత్యేక అతిథి పాత్రలోనూ నటించారని చిత్ర బృందం పేర్కొంది.

సమాజంలో వస్తున్న మార్పులు, ఆధునిక సంబంధాలు, మహిళల పట్ల దృక్పథం చుట్టూ ఈ కథ సాగుతుందని నిర్మాత శ్రీదేవి మల్లిపాముల తెలిపారు. నేటి తరం ఆలోచనలతో పాటు కుటుంబ అనుబంధాలను స్పృశిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు.

ఈ చిత్రంలో అభిజీత్, కిరీటి దామరాజు, ఆర్జే కాజల్, శ్రీవాణి ఇతర కీలక పాత్రల్లో నటించారు. జ్ఞానశేఖర్ వీఎస్ ఛాయాగ్రహణం అందించగా, కరణ్ పాండవ్ మరియు నిర్వాణ్ ఆత్రేయ నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు.

Exit mobile version