ఇంటర్వ్యూ : శేఖర్ కమ్ముల – అనామిక 5 నిమిషాలు చూస్తే మీరు కహానీ మర్చిపోతారు..

ఇంటర్వ్యూ : శేఖర్ కమ్ముల – అనామిక 5 నిమిషాలు చూస్తే మీరు కహానీ మర్చిపోతారు..

Published on Apr 30, 2014 5:56 PM IST

Shekar-Kammula
సున్నితమైన బావోద్వేగాలతో సినిమాలు తీసే డైరెక్టర్ శేఖర్ కమ్ముల మొదటి సారి తన పంథా మార్చి తీసిన సినిమా ‘అనామిక’. మహిళలకు జరుగుతున్న అన్యాయాలను చూసి చలించిన శేఖర్ కమ్ముల ఈ సినిమాతో మహిళల యొక్క బలాన్ని చూపించాలనుకున్నాడు. పేరుకి రీమేక్ అయిన చాలా మార్పులు చేసిన తీసిన ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషించిది. మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా మేము శేఖర్ కమ్ములతో కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) కహాని లాంటి సినిమాని ఎందుకు రీమేక్ చేయాలనుకున్నారు?

స) నిజానికి ఇది నా ఐడియా కాదు. ఎప్పుడైతే నిర్మాతలు నన్ను అప్రోచ్ అయ్యారో అప్పుడు కాస్త ఆలోచనలో పడ్డాను. ఆ తర్వాత నిర్మాతలకి నా మీద ఉన్న నమ్మకం, ఇండియాలో పలు చోట్ల చోటు చేసుకున్న పరిణామాల వల్ల నేను ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.

ప్రశ్న) లీడ్ రోల్ పాత్ర కోసం నయనతారని ఎందుకు తీసుకున్నారు? నయనతారని కాకుండా వేరే ఎవరినన్నా ట్రై చేసారా?

స) తెలుగు, తమిళ భాషల్లో నయనతారకున్న ఇమేజ్ ప్రకారం తనని తీసుకున్నాం. నయనతార కాకుండా అనుష్క, అంజలి ఇలా చాలా మందిని అనుకున్నాం కానీ ఫిఅనల్ గా నయనతారని ఎంచుకున్నాం.

ప్రశ్న) ఇక నయనతార విషయానికి వస్తే, తను ఎందుకు సినిమాని ప్రమోట్ చేయడం లేదు?

స) తన ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఒక పెద్ద కార్పోరేట్ సంస్థ నిర్మాణ బాధ్యతలు తీసుకుంటే ప్రమోషన్ అనేది పెద్ద సమస్య కాదు. చెప్పాలంటే తను రాకపోవడం వల్లే సినిమాకి చాలా క్రేజ్ వచ్చింది.

ప్రశ్న) సొంత స్టొరీలు రాసుకునే మీరు యండమూరి వీరేంద్రనాథ్ గారి సాయం ఎందుకు తీసుకున్నారు?

స) నేను ఎప్పటి నుంచే యండమూరి గారితో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. కానీ కుదరలేదు. నేను ఎప్పుడైతే థ్రిల్లర్ సినిమా తీయాలని అనుకున్నానో అప్పుడు నా మదిలో వచ్చిన మొదటి పేరు ఆయనదే. థ్రిల్లర్స్ లో ఆయనొక మాస్టర్. అందుకే ఆయన హెల్ప్ తీసుకున్నాను.

ప్రశ్న) హిందీలో వర్కౌట్ అయ్యింది ప్రెగ్నెన్సీ కాన్సెప్ట్. కానీ మీరు ఇందులో హీరోయిన్ కి ప్రెగ్నెన్సీ లేకుండా చూపించారు. ఇలా చేయడానికి ఏమన్నా స్పెషల్ రీజన్ ఉందా.?

స) కహానీ సినిమాలోని సస్పెన్స్ అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే ఆ కాన్సెప్ట్ ఉండకూడదు అనుకున్నాను. అలాగే నేను మామూలు పాత్రతోనే ఆడియన్స్ కి ఆ ఎమోషన్ ని కనెక్ట్ చెయ్యాలి అనుకున్నాను.

ప్రశ్న) ఎప్పుడూ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేసే మీరు మొదటి సారి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారితో పనిచేయడం ఎలా ఉంది?

స) ఈ సినిమా కోసం ఆయనతో పనిచేసిన రోజులు ఎంతో స్పెషల్ అని చెప్పాలి. సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాకి ఆయన మ్యూజిక్ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది.

ప్రశ్న) మీ సినిమాలకి పూర్తి భిన్నమైన కథాంశం అనామిక. మీకు ఇది డీల్ చేయడం కష్టంగా అనిపించిందా?

స) ఈ సినిమాకి రాయడం అనేది కష్టమైన పనే, ఒకసారి పూర్తి స్క్రిప్ట్ రాసుకున్నాక సినిమా పరంగా ఎలాంటి ఇబ్బంది రాలేదు. మీరు కూడా రెండు గంటలు హై వోల్టేజ్ థ్రిల్లర్ మూవీ చూస్తారు.

ప్రశ్న) తమిళ వెర్షన్ గురించి, అక్కడ రిలీజ్ కి సంబందించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?

స) తమిళ వెర్షన్ కి కూడా ఇక్కడిలానే సమానమైన క్రేజ్ ఉంది. చెప్పాలంటే తమిళ్ లో తెలుగులో కంటే పెద్ద రిలీజ్ అవుతోంది. అలాగే సినిమాపై అంచనాలు కూడా బాగున్నాయి.

ప్రశ్న) మీరొకసారి గుర్తు చేసుకుంటే, మీ సినిమాలతో పాటే మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. దానికి ఏమన్నా ప్రత్యేక కారణం ఉందా?

స) నవ్వులు.. నేను ఎప్పుడూ ఆ విషయం గురించి ఆలోచించలేదు. కానీ ఈ సారి మాత్రం నా సినిమాతో పాటు కొత్త జంట సినిమా రిలీజ్ అవుతోందని తెలుసు. ఇది యాదృచ్చికం మాత్రమే, ప్లాన్ చేసింది కాదు..

ప్రశ్న) మీరు తదుపరి చేయనున్న సినిమాల గురించి చెప్పండి?

స) అనామిక రిలీజ్ అయిన తర్వాత, నేను హ్యాపీ డేస్ సినిమాని హిందీలో రీమేక్ చేయనున్నాను. దానికి సల్మాన్ ఖాన్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

ప్రశ్న) అందరూ ఒరిజినల్ వెర్షన్ చూసేసి ఉన్నా కూడా ‘అనామిక’ సినిమా ఎందుకు చూడాలంటారు?

స) నా పరంగా కామన్ పబ్లిక్ కహానీ సినిమా చూడలేదు. ఈ సినిమా సారాంశం హిందీలానే ఉండొచ్చు కానీ నేను తీసిన విధానం తెలుగు నేటివిటీకి దగ్గరగా, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనామిక చూడటం మొదలు పెట్టిన 5 నిమిషాలకు మీకు కహానీ గుర్తుకురాదని మాత్రం చెప్పగలను.

అంతటితో శేఖర్ కమ్ముల తీసిన థ్రిల్లర్ ప్రయత్నం విజయం సాధించాలని అల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం.

తాజా వార్తలు