
నందమూరి బాలకృష్ణ తన 54వ పుట్టిన రోజు వేడుకని నిన్న రామకృష్ణ స్టూడియోస్ లో అభిమానుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ వేడుకలో ఆయన తన 100వ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందని అన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ ‘ పూర్వ జన్మ సుకృతం వలన నందమూరి తారకరామారావు బిడ్డగా పుట్టాను. ఆయన ఈన్నో అద్భుతమైన పాత్రలు చేసి అందనంత ఎత్తుకి ఎదిగారు. నేను ఆయన బాటలోనే పయనిస్తున్నాను. నటుడిగా, బాధ్యతగల రాజకీయ నాయకుడిగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అందుకే మంత్రి పదవిని సైతం వదులుకున్నాను. నా 98వ సినిమా అందరినీ మెప్పించేలా ఉంటే, నా 100వ సినిమా మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండబోతోందని’ ఆయన ప్రకటించారు.
100వ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన బాలకృష్ణ ఎవరితో ఉంటుందనేది మాత్రం చెప్పలేదు. బాలకృష్ణ ఇప్పిటికే అధికారికంగా ప్రారభించిన తన 98వ సినిమాకి సత్య దేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష హీరోయిన్ గా కనిపించనుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

