
మూడు దశాబ్దాలు తెలుగు ప్రేక్షకులను తన నటనతో, డాన్సులతో అలరించిన మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమాలలో రీ-ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. చిరు 150వ సినిమాగా తెరకేక్కనున్న ఈ సినిమాపై అప్పుడే భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. చిరంజీవి 30 ఏళ్ళ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించారు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా ప్రతి భావాన్ని పలికించడంలో చిరంజీవిది ప్రత్యేకమైన శైలి. మరి మెగాస్టార్ 150వ సినిమా ఎలా ఉండాలి..? ఎటువంటి కథలో చిరు నటిస్తే అభిమానులు సంతోషిస్తారు..? దర్శకుడు ఎవరు..? అనే విషయాలలో మెగా ఫ్యామిలీ చాలా కసరత్తులు చేస్తుంది.
పరుచూరి బ్రదర్స్ రాసిన ‘ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’ కథలో చిరు నటిస్తారని ఒక రూమర్ వినిపిస్తుంది. అయితే చిరు 150వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’ కాదని దర్శకుడు వివి వినాయక్ తెలిపారు. మెగాస్టార్ 150వ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారు అనే ప్రచారం జరుగుతుంది. దీనిపై స్పందించారు వివి వినాయక్… ‘మెగా అభిమానులు చిరంజీవి 150వ సినిమాకు నేను దర్శకత్వం వహిస్తే బాగుంటుదని అంటున్నారట. సినిమా ఇండస్ట్రీలో 30 ఏళ్ళ అనుభవం చిరంజీవి గారి సొంతం. స్క్రిప్ట్ జడ్జ్ చేయడంలో అయన తర్వాతే ఎవరైనా. ప్రస్తుతం చాలా కథలు వింటున్నారు. కథ, దర్శకుడు ఎవరినే విషయం చిరంజీవి గారు త్వరలో వెల్లడిస్తారు. ఈ విషయంలో వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది. అని అన్నారు.
చిరంజీవి 150వ సినిమాలో నేను నటిస్తాను అంటూ ఇటివల రామ్ చరణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. చిరు పుట్టినరోజు నాడు ఈ సినిమా విషయాలు వెల్లడించనున్నారు.

