ఇంటర్వ్యూ : సంతోష్ శ్రీనివాస్ – ‘రభస’లో ఎన్.టి.ఆర్ లోని న్యూ డైమెన్షన్ ని చూస్తారు.

ఇంటర్వ్యూ : సంతోష్ శ్రీనివాస్ – ‘రభస’లో ఎన్.టి.ఆర్ లోని న్యూ డైమెన్షన్ ని చూస్తారు.

Published on Jul 17, 2014 12:03 PM IST

Santosh-Srinivas
యంగ్ హీరో రామ్ నటించిన ‘కందిరీగ’ సినిమాతో సంతోష్ శ్రీనివాస్ తెలుగు చిత్ర సీమకి దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న సంతోష్ శ్రీనివాస్ తన రెండవ సినిమా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చాన్స్ కొట్టేసాడు. ఎన్.టి.ఆర్ తో చేస్తున్న ‘రభస’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగష్టు 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే రేపు సంతోష్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కాసేపు ముచ్చటించి ‘రభస’ విశేషాలను, తను చేయబోయే సినిమాలను గురించి తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ఎన్.టి.ఆర్ ‘రభస’ ఎలా ఉంటుంది.?

స) ‘రభస’ సినిమా యూత్ ఫుల్, ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్. వీటన్నిటితో పాటు ఇందులో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. బాగా కామెడీగా ఉంటూనే అన్ని ఎమోషన్స్ ఉండేలా ఈ సినిమా ఉంటుంది.

ప్రశ్న) ‘రభస’లో ఎన్.టి.ఆర్ పాత్ర గురించి చెప్పండి.?

స) ప్రతి తల్లి నాకు ఇలాంటి కొడుకు ఉంటే బాగుంటుంది అనే రీతిలో ఎన్.టి.ఆర్ పాత్ర ఉంటుంది. గత సినిమాలకి ఈ సినిమాకి ఎన్.టి.ఆర్ పాత్రలో ఉన్న వైవిధ్యం ఏమిటి అంటే ఆయన క్యారెక్టరైజేషన్ ని ఆయనే ఐడెంటిఫై చేసుకుంటాడు. ఆ తర్వాత ఆయన ఏం కరెక్ట్ చేయాల్సి వచ్చింది అన్నదే ఇందులో చూపించాం. ఇందులో ఎన్.టి.ఆర్ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చేస్తూ యూత్ఫుల్ లుక్ లో కనిపిస్తే, సెకండాఫ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే క్లాస్ లుక్ లో కనిపిస్తాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ లోని కొత్త కోణాన్ని (న్యూ డైమెన్షన్) చూస్తారని మాత్రం గ్యారంటీగా చెప్పగలను.

ప్రశ్న) ఎన్.టి.ఆర్ తో సినిమా అనుకున్నాక కథలో ఏమన్నా మార్పులు చేసారా.?

స) నేను కథ రాసుకున్నప్పుడు, అలాగే ఎన్.టి.ఆర్ కి చెప్పినప్పుడు ఇదొక నార్మల్ ఎంటర్టైనర్. కానీ ఎన్.టి.ఆర్ లాంటి కమర్షియల్ హీరో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఒక 20 రోజుల టైం కేటాయించి కొన్ని కమర్షియల్ అంశాలను జత చేసి ఆయన రేంజ్ కి సరిపోయేలా కథని సిద్దం చేసాను.

ప్రశ్న) ఈ సినిమా ఇంత ఆలస్యం కావడానికి గల కారణాలేమిటి? అలాగే మధ్యలో కొరటాల శివ కొంత దర్శకత్వం వహించారని వార్తలు వచ్చాయి. దానిపై మీ కామెంట్.?

స) ఈ సినిమా మేము అనుకున్నాక అందరి డేట్స్ కోసం 7 నెలలు ఆగాల్సి వచ్చింది. షూటింగ్ మొదలు పెట్టాక కేవలం 135 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసాం. మధ్యలో నాకు సివియర్ జాండిస్ రావడం వల్ల షూట్ చెయ్యలేదు, కానీ ఆ టైంలో లిరిసిస్ట్ లని కూర్చోబెట్టుకొని పాటలు రాయించుకున్నాను. నేనులేని ఆ రెండు నెలల గ్యాప్ లో 4 పాటల్ని షూట్ చేసాం. అలాగే కొరటాల శివ డైరెక్ట్ చేసాడని వచ్చిన వార్తలన్నీ పుకార్లు మాత్రమే..

ప్రశ్న) ఈ సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ సమంత, ప్రణిత పాత్రల గురించి చెప్పండి.?

స) సమంత ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర చేసింది. కేవలం పాటల కోసం కాకుండా కథతో సంబంధం ఉండి కథతో పాటు ట్రావెల్ అయ్యే పాత్ర. తన అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇక ప్రణిత ఫస్ట్ హాఫ్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ పాత్ర చేసింది.

ప్రశ్న) మామూలుగా ఇండస్ట్రీలో ద్వితీయ యజ్ఞం సెంటిమెంట్ ఉంది. ఈ విషయంలో మీరు కూడా ఏమన్నా టెన్షన్ ఫీలవుతున్నారా?

స) నేను ప్రతి సినిమాకి టెన్షన్ పడతాను. ప్రతి సినిమాకి నా మొదటి సినిమాలనే కూర్చొని కథ రాసుకుంటాను. సినిమా తీసేప్పుడు కూడా చాలా భయంగా తీస్తాను. ఎందుకంటే కమర్షియల్ సినిమా అనేది 300 కుటుంబాలకు సంబందించినది. వారందరి రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా చేస్తాను.

ప్రశ్న) ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉందంటున్నారు. దాని గురించి చెప్పండి.?

స) ఈ సినిమా సెకండాఫ్ లో ఎన్.టి.ఆర్ – బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. చెప్పాలంటే వీరి ఎపిసోడ్ సినిమాని మరో రేంజ్ కి తీసుకెళుతుంది. నాకు తెలిసి ‘అదుర్స్’ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ కెమిస్ట్రీ ఈ సినిమాలోనే చూస్తారు. అలాగే మిగిలిన కమెడియన్స్ అంతా కూడా చాలా బాగా నవ్విస్తారు.

ప్రశ్న) వరుసగా బెల్లంకొండ సురేష్ గారితో పనిచేయడం ఎలా ఉంది?

స) బెల్లంకొండ సురేష్ గారితో పనిచేయడం హ్యాపీగా ఉంటుంది. ఆయనకి నాకు మధ్య ఫైట్ అంటే అది కథ విషయంలో మాత్రమే.. ఎందుకంటే ఇద్దరం ఒక పట్టాన ఒప్పుకోము. బెల్లంకొండ గారు జడ్జ్ మెంట్ చాలా బాగుంటుంది. కథతో ఆయన్ని ఒప్పించగలిగితే ఆడియన్స్ కి సినిమా నచ్చేసినట్లే.. కథ ఓకే చేసారు అంటే మనకు కావలసినది ఇస్తారు. నాకు తెలిసి ఏ నిర్మాత డైరెక్టర్ కి ఇంత ఫ్రీడం ఇస్తారు. నాకు అనే కాదు ఆయనతో చేసే అందరి దర్శకులకి ఇదే ఫ్రీడం ఉంటుంది,

ప్రశ్న) ఎన్.టి.ఆర్ అభిమానులు ఆయన నుండి సూపర్బ్ డాన్స్ లు, అదిరిపోయే ఫైట్స్ ని ఆశిస్తారు. ఈ సినిమాలో వాటి మోతాదు ఎలా ఉంటుందో చెప్పండి.?

స) ఇందులో కూడా డాన్సులు ఉంటాయి. ఇంట్రడక్షన్ సాంగ్, సినిమాలో వచ్చే మూడవ పాటల్లో డాన్సులు బాగా వేసాడు. అలాగే ఈ సినిమాలో మొత్తం 7 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. అందులో ఇంటర్వల్ బ్లాక్, ఇంటర్వల్ బ్లాక్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సీక్వెన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం హైలైట్ అవుతాయి.

ప్రశ్న) బెల్లంకొండ శ్రీనివాస్ గురించి చెప్పండి. తన మొదటి సినిమా అల్లుడు శీను గురించి చెప్పండి.?

స) నాకు బెల్లంకొండ శ్రీనివాస్ ముందు నుంచే తెలుసు. అతను ‘అల్లుడు శీను’ కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గ ఫలితం మీకు తెరపై కనపడుతుంది. నాకు తెలిసి కచ్చితంగా భవిష్యత్తులో ఓ స్టార్ హీరో అవుతాడు.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?

స) నేను ఇప్పటికే దానయ్య గారు నిర్మాతగా ఒక సినిమా, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ లో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాను. ఇది కాకుండా ఒక కథని రెడీ చేసాను. దానికి ‘తిక్కరేగితే’ టైటిల్ ని పెట్టాం. కానీ ఈ సినిమాని ఏ ప్రొడక్షన్ లో చేస్తాను. హీరో ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు చెబుతాను.

ప్రశ్న) ఈ మధ్య కాలంలో కొంతమంది దర్శకులు నిర్మాతలుగా మారుతున్నారు. మీరు కూడా అటు అడుగులేసే అవకాశం ఉందా.?

స) తమిళంలో మురుగదాస్, లింగుస్వామి, గౌతం మీనన్ లాంటి వాళ్ళు నిర్మాతలుగా సినిమాలు చేస్తున్నారు. నేను కూడా నిర్మాతగా సినిమాలు తీస్తాను. కానీ దానికి ఇంకా రెండు మూడు సంవత్సరాల టైం పట్టే అవకాశం ఉంది. మేము ఎలాగు ఒక సినిమా తీయడానికి 1 లేదా 2 సంవత్సరాల టైం పడుతోంది. నిర్మాతగా సినిమాలు చేయడం వాళ్ళ కాస్త ఫైనాన్సియల్ సపోర్ట్ ఉంటుంది.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి ఆల్ ది బెస్ట్ చెప్పాము..

తాజా వార్తలు