మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్న ‘అల్లుడు శీను’. సమంత హీరోయిన్ గా నటించింది. తోలి సినిమా ‘ఆది’ తరహాలో ‘అల్లుడు శీను’ సినిమా నాకు, హీరోకి మంచి పేరు తీసుకొస్తుంది అని వినాయక్ అన్నారు. ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి శనివారం పాత్రికేయులతో సమావేశం అయ్యారు ప్రకాష్ రాజ్.
మొదట వినాయక్ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇటువంటి కథను తెరకేక్కించాలంటే దర్శకుడికి తెలివితేటలతో పాటు కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. వినాయక్ సినిమాను ఎలా తెరకేక్కిస్తాడో అనే చిన్న సందేహం ఉంది. రషస్ చూశాకా వినాయక్ మేజిక్ చేశాడనిపించింది. ఇందులో డ్యూయల్ రోల్ చేశాను. తెలుగులో కమర్షియల్ ఫార్మట్ లో వస్తున్న కొత్త కథ ఇది. సాయి శ్రీనివాస్ బాగా నటించాడు. నాకు, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. బ్రహ్మానందం ‘అల్లుడు శీను’లో డింపుల్ పాత్రలో నటించారు.

