
భారత చలన చిత్ర పరిశ్రమ ఇటీవలే 100 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇటీవలే చెన్నైలో కూడా 100 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ 100 సంవత్సరాల భారత తెలుగు చలన చిత్ర రంగంలో 83 ఏళ్ళ తెలుగు చిత్ర పరిశ్రమకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటికీ ఇండియాలో అత్యధికంగా సినిమాని అభిమానించే వారు మన తెలుగు వారే కావడం ఎంతో గర్వించదగ్గ విషయం. దానికి నిదర్శనమే దేశంలో ఏ రాష్టంలోనూ లేనంతగా అత్యధిక థియేటర్స్ మన తెలుగు రాష్టంలో ఉండడమే..
ఈ 100 సంవత్సరాల భారత చలన చిత్ర రంగంలో 83 వసంతాల తెలుగు చిత్ర పరిశ్రమకి ఏదన్నా చెయ్యాలని డా. మోహన్ బాబు అంతర్మధనంలో ఉన్నారు. తన అంతర్మధనానికి గల కారణం తన పిల్లలకు చెప్పుకున్నారు. ఈ విషయంపై బాగా ఆలోచించిన మంచు విష్ణు 83 ఏళ్ళ తెలుగు సినీ రంగంపై ఓ ప్రత్యేక డాక్యుమెంటరీ తీసి తెలుగు చిత్ర సీమకి అంకితం ఇవ్వాలి అనుకున్నారు. ఇదే విషయాన్ని విష్ణు డా. మోహన్ బాబుకి చెప్పగా, ఆయన ఆలోచన బాగుందని డాక్యుమెంటరీ చేయడానికి ప్రోత్సహించాడు.
ప్రస్తుతం తండ్రైన డా. మోహన్ బాబు కోరికను తీర్చే పనిలో మంచు విష్ణు ఉన్నాడు. ఈ డాక్యుమెంటరీ తీయడం కోసం తెలుగు చిత్ర సీమపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. రానున్న యువతరానికి స్పూర్తిగా నిల్చేలా ఈ డాక్యుమెంటరీ ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి ప్రయత్నం చేస్తున్న డా. మోహన్ బాబు మరియు మంచు విష్ణులకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం.

