
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. దాదాపు టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కేవలం ఇక రెండు సాంగ్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఆడియో విడుదలకి ముహూర్తం కుదిరింది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ‘ఆగడు’ ఆడియోని ఆగష్టు 28వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో విడుదల చేయనున్నారు.
నిన్నటితో హైదరాబాద్ లో షూట్ చేస్తున్న క్లైమాక్స్ ఎపిసోడ్ ని పూర్తి చేసిన మహేష్ నిన్న రాత్రే సాంగ్ షూట్ కోసం యూరప్ బయలుదేరాడు. స్విట్జర్ ల్యాండ్ లో మిగిలి ఉన్న రెండు పాటలను అక్కడి అందమైన లోకేషన్స్ లో షూట్ చేయనున్నారు. ఆగష్టు 23తో ఈ రెండు సాంగ్స్ షూటింగ్ పూర్తవుతుంది. మహేష్ బాబు మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
‘దూకుడు’ తర్వాత మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ కనిపించనుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

