
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఉత్తమ విలన్’. కమల్ హాసన్ బిజీగా ఉండడం వలన ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. కమల్ హసన్ తో పాటు అందరూ ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలైన ఈ సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కమల్ హాసన్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కె. బాలచందర్, పూజ కుమార్, ఆండ్రియా, పార్వతి, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ – రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇది కాకుండా కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ సినిమా త్వరలో విడుదల కానుంది.

