
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా సినిమా ‘గోపాల గోపాల’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో మోడరన్ శ్రీకృష్ణుడిగా దేవుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దేవుడితో మాట్లాడే కీలకమైన స్వామీజీ పాత్ర ఒకటి ఉంది. ఒరిజినల్ వెర్షన్ లో మిథున్ చక్రవర్తి ఈ పాత్రను పోషించారు. తెలుగులో కూడా ఆ పాత్రను చేయవలసిందిగా సంప్రదిస్తే మొదట కొంచం సందేహించారు. ‘గోపాల గోపాల’ మూవీ యూనిట్ కమిట్‌మెంట్, సినిమా తెరకెక్కిస్తున్న విధానం చూసి స్వామీజీ పాత్ర చేయడానికి అంగీకరించారు. గురువారం నుండి మిథున్ చక్రవర్తి ‘గోపాల గోపాల’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మిథున్ చక్రవర్తి, వెంకటేష్ తదితరులు పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
‘ఓ మై గాడ్’ సినిమాలో లీలాధర్ స్వామిజీ పాత్రలో మిథున్ చక్రవర్తి నటనకు ప్రసంశలు లభించాయి. తెలుగులో ఆయన నటిస్తుండడం ‘గోపాల గోపాల’కు ప్లస్ అవుతుంది. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. డి.సురేశ్‌బాబు, శరత్ మరార్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. 2015 సంక్రాంతి కానుకగా ‘గోపాల గోపాల’ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

