
సూపర్ స్టార్ రజినీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా నటినటులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకుక్కుతున్న సినిమా ‘లింగా’. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ షిమోఘలో లింగనమక్కి డాం వద్ద జరుగుతోంది. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసి త్వరలో యూరోప్ లో సాంగ్స్ షూట్ చేయడానికి ప్లాన్ చేశారు.
గత మూడు నాలుగు రోజులుగా కర్ణాటకలో కురుస్తున్న భారి వర్షాలు ‘లింగా’ చిత్రీకరణకు అంతరాయం కలిగిస్తున్నాయని సమాచారం. భారి వర్షాల కారణంగా ‘లింగా’ షూటింగ్ లొకేషన్స్, లింగనమక్కి డాం పరిసర ప్రాంతాలు బురద బురదగా మారాయి. హోటల్స్ నుండి షూటింగ్ లొకేషన్ స్పాట్ కు చేరుకోవడానికి సరైన ప్రయాణ సౌకర్యాలు కూడా లేవట. రజినీకాంత్ మరియు దర్శకుడు కె.ఎస్.రవికుమార్ వర్షం తగ్గగానే త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి నిర్మాతకు నష్టం కలగకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
రజిని బర్త్ డే కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నారు. ఏఅర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

