రాకింగ్ స్టార్ మంచు మనోజ్, లవర్ బాయ్ అక్కినేని నాగ చైతన్య ఈ దసరా తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటిపడుతున్నారు. వీరు నటించిన ‘కరెంట్ తీగ’, ‘ఒక లైలా కోసం’ సినిమాలు అక్టోబర్ 17న.. ఒకే రోజు విడుదలవుతున్నాయి. 2010లో మనోజ్ ‘బిందాస్'(ఫెబ్రవరి 5), నాగ చైతన్యకు సక్సెస్ రుచి చూపించిన ‘ఏం మాయ చేశావే’ (ఫెబ్రవరి 26) సినిమాలు ఒకే నెలలో విడుదలై విజయాలు సాధించాయి. వాటి విడుదల మధ్య 20 రోజుల గ్యాప్ ఉంది. ఇలా ఒకే రోజున ఈ యంగ్ హీరోలిద్దరూ నటించిన సినిమాలు విడుదలవడం ఇదే మొదటిసారి. అందువల్ల, విశ్లేషకులు ఈ రెండు సినిమాల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మనోజ్ ‘కరెంట్ తీగ’ అంటూ మాస్ మసాలా సినిమాతో వస్తుంటే, ‘ఒక లైలా కోసం’ అంటూ రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు విజయం సాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఒకే సమయంలో ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదలైతే.. ప్రేక్షకులతో పాటు పరిశ్రమ ప్రముఖులు కూడా ఆ సినిమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఇటివల కాలంలో మహేష్ బాబు, రామ్ చరణ్ ల మధ్య ఇటువంటి ఆసక్తికరమైన పోటి నడిచింది.


