ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్ సినిమాలా హవా ఊపందుకుంది. స్టార్ హీరోలు కూడా ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ‘గోపాల గోపాల’ సెట్స్ పై ఉంది. అలాగే త్వరలోనే నాగార్జున – కార్తి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. వీటితో పాటు మరో మల్టీ స్టారర్ మూవీ సిద్దమవుతోంది. విక్టరీ వెంకటేష్ – మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ మూవీ ఉంటుందని ఇది వరకే తెలియజేశాం.
ఈ సినిమాకి వీరు పోట్ల కథని సిద్దం చేస్తున్నారని కూడా ఇదివరకే తెలియజేస్తున్నాం. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించనున్నారని సమాచారం. అనుకున్నట్టుగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి 14 రీల్స్ వాళ్ళు ఈ సినిమాని నిర్మిస్తే టాలీవుడ్ లో వచ్చే మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అవుతుంది. మరో కొద్ది రోజుల్లో ఈ విషయంపై కచ్చితమైన అధికారిక ప్రకటన వస్తుందని ఆశించవచ్చు.


