
పైరసీదారుల ఆగడాలు రోజు రోజుకూ శ్రుతిమించుతున్నాయి. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్, వీడియో లైబ్రరీలలో సినిమా కాపీలను అమ్మకానికి పెడుతున్నారు. తద్వారా నిర్మాతల ఆదాయానికి గండి కొడుతున్నారు. చిత్ర పరిశ్రమకు కోట్ల రూపాయలలో నష్టాన్ని కలిగిస్తున్నారు.
తాజాగా ఈ శుక్రవారం విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘లింగ’ సినిమా పైరసీ సిడిలు, డివిడిలు సాయంత్రానికల్లా మార్కెట్ లోకి వచ్చేశాయి. వంద, రెండు వందల సిడిలు కాదు, ఏకంగా 60 వేల సిడిలను ఓ పైరసీ ముఠా సిద్దం చేసింది. గుంటూరు జిల్లా వినికొండలో పోలీసు తనిఖీలలో ఈ పైరసీ అనకొండ బాగోతం బయటపడింది. ‘లింగ’తో సహా ఇతర కొత్త సినిమా పైరసీ ప్రింట్స్ కూడా ఈ తనిఖీలలో లభించాయి. ఇంత పెద్ద మొత్తంలో పైరసీ సిడిలు లభించడం చిత్ర పరిశ్రమ ప్రముఖులలో ఆందోళన కలిగిస్తుంది.
ముఖ్యంగా అగ్ర హీరోలు నటించిన సినిమాలకు తొలివారంలో టికెట్స్ లభించడం లేదు. మల్టీప్లెక్స్ టికెట్ల ధర కూడా సాధారణ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, సింగల్ స్క్రీన్లలో బ్లాక్ టికెట్ అమ్మకాలు పైరసీదారులకు వరంలా మారింది. తమ అభిమాన హీరో సినిమాను వారంతం (వీకెండ్)లో చూడాలనుకునే ప్రేక్షకులు, సాధారణ ప్రజలు పైరసీ సిడిలను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితికి ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక నిర్మాతలు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

