
‘అపరిచితుడు’ తర్వాత శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన సినిమా ‘ఐ’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ‘ఐ’లో ఒకేసారి మూడు భిన్నమైన క్యారెక్టర్లు.. మానవ మృగం, వికృత రూపం కల మనిషిగా, బాడీ బిల్డర్ గా విక్రమ్ నటించారు. ఒక పాత్ర కోసం విపరీతంగా బరువు తగ్గారు. ఇంత రిస్క్ అవసరమా..? అని పలువురు ప్రశ్నించారు.
వైవిధ్యమైన క్యారెక్టర్లలో కనిపించడానికి అమితంగా ఇష్టపడే విక్రమ్.. ‘ఐ’ లాంటి సినిమా కోసం ఎటువంటి రిస్క్ చేసినా ఫర్వాలేదనిపించింది. నటించేకొద్దీ ఆ పాత్రలపై ఇష్టం పెరిగిపోయింది. ఎంతో ఉత్సాహంగా ‘ఐ’లో నటించాను. థియేటర్లో సినిమా చూసిన తర్వాత అంత రిస్క్ ఎందుకు చేశానో ప్రేక్షకులకు అర్ధమవుతుంది. ‘ఐ’తో నటుడిగా నా కల నిజమైంది. అని ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అమీ జాక్సన్ ఈ సినిమాలో హీరోయిన్. ఏఅర్ రెహమాన్ సంగీతం అందించారు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత.

