అల్లరి నరేష్… అవుట్ & అవుట్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇంద్రగంటి మోహనకృష్ణ.. క్లాస్ డైరెక్టర్. వీరిద్దరి కలయికలో ఇ.వి.వి. సినిమా పతాకంపై ‘బందిపోటు’ సినిమా తెరకెక్కింది. ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లు నిర్మాతలు. ఈషా కథానాయిక. కళ్యాణ్ కోడూరి సంగీత దర్శకుడు. ఈ శుక్రవారం, 20వ తేదిన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘బందిపోటు’ విశేషాలను తెలియజేయడానికి హీరో, నిర్మాత మీడియాతో సమావేశం అయ్యారు. ఆ ముచ్చట్లు మీకోసం..
ప్రశ్న) ‘బందిపోటు’ విడుదలకు ముందు దండయాత్ర ప్రారంభించారు..?
స) స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలకు రిలీజ్ డేట్ ఎప్పుడనేది ప్రేక్షకులకు తెలియడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ తరహా ప్రమోషనల్ కాంపెయిన్ బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు బాగా చేస్తారు. నెలన్నర, రెండు నెలల ముందు నుండి ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్రారంభిస్తారు. టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఆ ధోరణి మొదలవుతుంది. రిలీజ్ డేట్ తెలియపరచడం కోసం ఈ దండయాత్ర.
ప్రశ్న) తెలుగులో చాలా బిజీ హీరో. షూటింగ్, హెవీ షెడ్యూల్స్ మధ్య ప్రమోషన్ చేయడానికి టైం కుదురుతుందా..?
స) సినిమా తీయడం ఒక ఎత్తు, ప్రమోషన్ చేయడం మరొక ఎత్తు. ఒక యాక్టర్ గా బిజీ షెడ్యూల్లో కొంచం అలసిపోయాను. కానీ, ఈ సినిమా రిజల్ట్ బట్టి నా తర్వాత సినిమా బిజినెస్ ఆధారపడి ఉంటుంది కదా. గతంలో పలు సినిమాలకు ఈ తరహా ప్రమోషన్ చేయాలనుకున్నా కుదరలేదు. ఈ సినిమాకు నిర్మాత నేనే కావడంతో ఒక అడుగు ముందుకు వేసి దండయాత్ర చేశాం. ఇక నుండి సినిమా సినిమాకు మధ్య ప్రమోషన్ చేయడం కోసం ఒక 15 రోజులు గ్యాప్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను.
ప్రశ్న) మీరు అవుట్ & అవుట్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇంద్రగంటి క్లాస్ డైరెక్టర్. మీ ఇద్దరికి ఎలా సింక్ అయ్యింది..?
స) ‘అష్టా చమ్మా’ చూసిన తర్వాత ఇంద్రగంటిపై మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. ఆ సినిమా కథ చిన్నదైనా, కథనం బాగుంటుంది. ఆయన సెటైరికల్ రైటింగ్ స్టైల్ ఇష్టం. 2012 నుండి మేము ఓ సినిమా చేయాలనుకుంటున్నాం, ప్రాసెస్ అప్పటి నుండి జరుగుతుంది. నేను, రాజేష్ నాన్నగారి పేరు మీద బ్యానర్ రీ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని భావించాం. మా అమ్మ, వదినతో కలిసి సినిమా చూస్తే ఇబ్బంది పడకూడదు. అప్పుడు ఇంద్రగంటి అయితే మంచి ఛాయస్ అనుకున్నాం. ఆయన కథ రెడీ కావడంతో ప్రారంభించాం.
ప్రశ్న) మరి, ఈ సినిమా ఎవరి స్టైల్లో ఉంటుంది..?
స) నాకు బి, సి సెంటర్లో మంచి మార్కెట్ ఉంది. ఇంద్రగంటికి ‘ఎ’ క్లాస్ సెంటర్ ప్రేక్షకులలో అభిమానులు ఎక్కువ. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఇంటెలిజెంట్ కామెడీ సినిమా. రెగ్యులర్ గా నా సినిమాల్లో ఉండే ‘స్పూఫ్’ కామెడీ ‘బందిపోటు’లో ఉండదు. సిట్యువేషనల్ ఫన్ ఎక్కువ. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే పంచ్ డైలాగులు ఉంటాయి. ఫస్ట్ టైం ఇంద్రగంటి సినిమాలో ఓ ఐటెం సాంగును చూడబోతున్నారు.
ప్రశ్న) ‘బందిపోటు’లో ఎలాంటి దొంగలను దోచుకొబోతున్నారు..?
స) నిజాయితిగా డబ్బు సంపాదించిన వాళ్ళకు ఈ బందిపోటు నుండి ఎటువంటి హాని జరగదు. స్కాంలు, స్కీములు పేరుతో అక్రమ మార్గాలలో డబ్బు సంపాదించిన వారిని దోచుకుంటాడు. వాళ్ళు ఎవరి వద్ద నుండి డబ్బు కాజేశారో వారికి అందేలా చూస్తాడు. చూడడానికి చాలా స్టైల్ గా ఉన్నా మాస్ కుర్రాడిలా ఉంటాడు.
ప్రశ్న) కళ్యాణ్ కోడూరి సంగీతం గురించి..?
స) కామెడీ సినిమాల్లో పాటలు స్పీడ్ బ్రేకర్లలా మారాయని ఇటివల వినిపిస్తున్న మాట. అందుకే, ఈ సినిమాలో కథ ప్రకారం కేవలం నాలుగు పాటలు మాత్రమే పెట్టాం. నా గత సినిమాల్లో పాటలు బాగోలేదని కొంచం విమర్శలు వచ్చాయి. అవి దర్శకుల ఛాయస్. నాకు ఇతరుల పనిలో కల్పించుకోవడం ఇష్టం ఉండదు. ఈ సినిమాకు నేను నిర్మాత కావడం, ఇంద్రగంటి గారు అడగడంతో మొదటిసారి మ్యూజిక్ సిట్టింగ్లలో కొంత మేర ఇన్వాల్వ్ అయ్యాను. కళ్యాణ్ కోడూరి మంచి సంగీతం అందించారు. పాటలకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. పాటలకు మించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మేజర్ ప్లస్ పాయింట్ అవుతుంది.
ప్రశ్న) ఈషా నటన గురించి..? ఆమె ఎంపిక ఎవరి ఛాయస్..?
స) నేను ‘బందిపోటు’ అయితే, ఈషా నాకు ‘బందిపోటి’. హీరో ఒక ఎత్తు వేస్తే.. హీరోయిన్ రెండు ఎత్తులు వేసే రకం. చాలా బరువైన పాత్ర. కామెడీ టైమింగ్ ఉండాలి. మెచ్యూర్ పెర్ఫార్మన్స్ చేయగలగాలి. రావు రమేష్, తనికెళ్ళ భరణి ఇతర సీనియర్ ఆర్టిస్టుల మధ్య ఆ అమ్మాయి బాగా నటించింది. హీరోయిన్ క్యారెక్టర్ కు తెలుగు తెలిసిన అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నాం. అప్పుడు, దర్శకుడు ఇంద్రగంటి ఈషాను ఎంపిక చేశారు.
ప్రశ్న) సంపూర్నేష్ బాబును ఎవరు సెలెక్ట్ చేశారు..?
స) నేను ‘హృదయ కాలేయం’ సినిమా చూడలేదు. ఓ రోజు టీవీలో ఆ సినిమా ఆడియో ఫంక్షన్ చూశాను. స్టేజిపై రెండు పేజిల డైలాగును అవలీలగా చెప్పాడు. అతని నవ్వు, ఆ సన్నివేశం ఇంకా గుర్తున్నాయి. ‘బందిపోటు’లో ఎ క్యారెక్టర్ కు ఎవరు అయితే బాగా సూటవుతారు అని ఆలోచిస్తున్నప్పుడు నాకు సంపూ గుర్తొచ్చాడు. సినిమాలో అతని క్యారెక్టర్ బాగుంటుంది.
ప్రశ్న) ఈ సినిమాతో నిర్మాతగా మారారు. ఏవైనా కష్టాలు ఎదురయ్యయా..?
స) ఇ.వి.వి. బ్యానర్లో వచ్చిన తొలి సినిమా ‘చాలా బాగుంది’ సినిమాతో క్యాషియర్ గా నా సినీ జీవితం మొదలైంది. రెండో సినిమాకు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. ప్రతి సినిమాకు బడ్జెట్ ఎక్కువ కాకుండా చూసుకోవడం అలవాటు. సొంత సినిమా కావడంతో కాస్త భాద్యత పెరిగింది. నాన్నగారి పేరు నేలబెట్టేలా, సినిమా చుట్టేశాడు అనే పేరు రాకుండా సినిమాను నిర్మించాం. విజువల్ గా సినిమా బ్యూటిఫుల్ గా ఉంటుంది.
ప్రశ్న) మీరు అనుకున్న బడ్జెట్ లోనే సినిమా తీశారా..? ఎక్కువ అయ్యిందా..?
స) ముందుగా అనుకున్న బడ్జెట్ లోనే సినిమా నిర్మాణం పూర్తయింది. ఎక్కువ ఏమి కాలేదు. 9 కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీశాం. ప్రమోషనల్ కార్యక్రమాలకు ఓ కోటు ఖర్చయింది.
ప్రశ్న) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్..?
స) శ్రీను వైట్ల అసిస్టెంట్ సాయి కిషోర్ దర్శకత్వంలో ఏకె ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో 49వ సినిమా చేస్తున్నాను. 60% షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సాక్షి చౌదరి హీరోయిన్. అనిల్ సుంకర నిర్మాత.
ప్రశ్న) అల్లరి నరేష్ 50వ సినిమా ఇ.వి.వి. బ్యానర్లో ఉంటుందా..? బయట నిర్మాణ సంస్థలో ఉంటుందా..?
స) ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం కథలు వింటున్నాను. నా 51, 52వ సినిమా కథలు కూడా ఫైనలైజ్ చేశాను. 50వ సినిమా కథ ఫైనలైజ్ కాలేదు. ఒక నటుడిగా 50వ సినిమా అనేది నాకు ఓ మైలురాయి లాంటిది. నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోవాలని భావిస్తున్నాను. కథ ఫైనలైజ్ అయిన తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తాను. ఇద్దరు ముగ్గురు అగ్ర నిర్మాతలు 50వ సినిమాను నిర్మిస్తాం అని అడిగారు. కానీ, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.


