
వరల్డ్ కప్ ఫీవర్ ఒకవైపు, ఇంటర్మీడియట్ మరియు ఇతర వార్షిక పరీక్షలు మరోవైపు.. వెరసి తెలుగు నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడానికి కాస్త సందేహిస్తున్నారు. ఈ శుక్రవారం, మార్చి 13న ఏడు లో బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నాయి. అవేమిటో మెజారిటీ ప్రేక్షకులకు తెలియదనడంలో ఆశ్చర్యం లేదు. వాటిలో మూడు డబ్బింగ్ సినిమాలు కావడం గమనార్హం.
రాజేంద్ర ప్రసాద్, ఓ శునకం ప్రధాన పాత్రలలో నటించిన ‘టామీ’ ఈ వారమే విడుదలవుతుంది. స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో కాస్త ప్రేక్షకులకు తెలిసిన సినిమా ఇదే. తర్వాత హాట్ హాట్ స్టిల్స్, పోస్టర్లతో ‘హీరోయిన్’ సినిమా క్రేజ్ సంపాదించింది. ‘తప్పటడుగు’, ‘జగన్నాటకం’ అనే మరో రెండు సినిమాలు కూడా ఈ శుక్రవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
జీవా, త్రిష, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన ‘చిరునవ్వుల చిరుజల్లు’, విజయ్ అంటోనీ ‘Dr. సలీమ్’, క్రికెటర్ ప్రసాద్, సుహాసిని మణిరత్నంల ‘సచిన్ టెండూల్కర్ కాదు’ వంటి డబ్బింగ్ సినిమాలు ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నాయి. పేరున్న నటీనటులు ఉన్నా.. ఇప్పటికే పలు విడుదల తేదీలు మారడంతో వీటిపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
వరల్డ్ కప్ ఫీవర్ నేపధ్యంలో ఈ సినిమాలు ఎంతవరకు ప్రేక్షకాదరణ పొందుతాయో వేచి చూడాలి.

