
సూపర్ స్టార్ మహేష్ బాబు.. తెలుగు హీరోల్లో టాప్ హీరోల లిస్టులో మొదటి వరుసలో ఉన్న హీరో. ‘దూకుడు’, ‘బిజినెస్‌మేన్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి మూడు వరుస సూపర్ హిట్ల తర్వాత రెండు ఫ్లాపులు వచ్చాయి. ‘1 నేనొక్కడినే’ సినిమాకి ప్రశంసలు వచ్చినా, కలెక్షన్లు మాత్రం రాలేదు. ఇక ‘ఆగడు’ సినిమా అయితే మహేష్ అభిమానులను సైతం నిరాశకు గురిచేసింది. ఇక రెండు వరుస ఫ్లాపుల తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలన్న ఆలోచనలో ఉన్న మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీస్తున్నాడు. శ్రీమంతుడు (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో మహేష్, సరికొత్తగా కనిపించనున్నాడు. కోటీశ్వరుడి పాత్రలో నటిస్తున్న మహేష్ గెటప్ స్టైలిష్‌గా ఉంటుందని సమాచారం.
ఈ సినిమా విషయంలో మహేష్, అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడట. స్క్రిప్ట్ నుంచి, పాత్రలో కొత్తదనం దాకా అన్నీ జాగ్రత్తగా చూసుకున్నాడట. షూటింగ్ దశలో ఎక్కడా ఏ లోపం జరగకుండా పకడ్బందీగా హిట్టు కొట్టేందుకే శ్రమిస్తున్నట్లు యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నిజానికి ఈ రెండేళ్ళలో తెలుగు సినిమా మార్కెట్ స్థాయి కూడా చాలా పెరిగింది. ఈ సమయంలో మహేష్ ఒక్క హిట్టూ కొట్టకపోవడంతో ఇప్పుడున్న మార్కెట్‌లో ఆయన స్టామినా ఏంటో కొత్తగా తెలిసే అవకాశం రాలేదు. అయితే మహేష్ సినిమాకి హిట్ టాక్ గనక వస్తే.. అది ఎంతటి స్థాయి విజయాన్ని నమోదు చేస్తుందనేది మన అంచనాలకు కూడా అందదనేది ట్రేడ్ వర్గాల టాక్. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది. మరి శ్రీమంతుడుతో మహేష్ హిట్ కొడతాడా ? హిట్ కొట్టి తన మార్కెట్ స్థాయి ఏంటన్నది బాక్సాఫీస్‌కు పరిచయం చేస్తాడా ? సినిమా విడుదల దాకా వేచిచూడాలి.

