
చాన్నాళ్ళకు వెండితెరపై మణిరత్నం మ్యాజిక్ మళ్ళీ పనిచేసింది. గత కొంతకాలంగా తనదైన సినిమా తీయలేకపోయిన మణిరత్నం ‘ఓకే కన్మణి’ సినిమా ద్వారా మళ్ళీ తానేంటో నిరూపించుకున్నారు. ఈ సినిమాను ‘ఓకే బంగారం’ పేరుతో తెలుగులో అనువదించి రెండు భాషల్లోనూ ఒకేరోజు విడుదల చేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం (ఏప్రిల్ 17న) విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మణిరత్నం తన స్టైల్లో ఒక ప్రేమకథను తెరకెక్కిస్తే అది ఎంత అందంగా, అర్థవంతంగా ఉంటుందో తీసి చూపించారు. సహజీవనం నేపథ్యంలో నడిచే ఈ సినిమాను చాలా తెలివిగా, సున్నితంగా తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది.
‘ఓకే బంగారం’ సినిమాకు సాధారణ ప్రేక్షకుడి నుంచే కాకుండా సినీ పరిశ్రమ నుండి కూడా మంచి స్పందన వస్తోంది. తమిళంలో ఈ సినిమా విడుదలైన రోజు నుంచే ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఈ జాబితాలో చేరిపోయారు. మణిరత్నం, ఏ.ఆర్.రెహమాన్, పీసీ శ్రీరామ్‌లు మళ్ళీ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారని సూర్య అన్నారు. ఇక దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ల మీదినుంచి చూపు తిప్పుకోలేనంత అందంగా వారు నటించాని సూర్య ప్రశంసించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ల జంట ఆద్యాంతం ప్రేక్షకుడిని కట్టిపడేసింది. తారగా నటించిన నిత్యామీనన్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. ఇక ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సినిమాకు మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

