
కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ లతో సినిమాకు ఎనలేని క్రేజ్ ని తీసుకురావడం కేవలం రాజమౌళికి మాత్రమే సొంతమైన విద్య. బాహుబలి ఫస్ట్ లుక్ పోస్టర్, శివుడుగా ప్రభాస్ ఎలా ఉంటారో ప్రేక్షకులకు పరిచయం చేసి సినిమాకు మంచి ప్రమోషన్ అందించాడు. ఇప్పుడు అనుష్క వంతు వచ్చింది. బాహుబలిలో దేవసేనగా అనుష్క నటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం అనుష్క పోస్టర్ విడుదల చేస్తున్నట్టు రాజమౌళి ట్విట్టర్లో తెలిపారు. ‘బాహుబలి’ రెండవ భాగంలో అనుష్క హీరోయిన్ అనే సంగతి మీకు తెలుసు. కానీ, మొదటి భాగం ‘బాహుబలి – ద బిగినింగ్’లో కొద్ది సమయం వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తుందని దర్శకుడు చెప్పారు. మేకింగ్ వీడియోలో రాజసం ఉట్టిపడే పాత్రలో అనుష్క ఆహార్యం అందరిని ఆకట్టుకుంది. మొదటి పార్టులో ఆమె ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలం అందరిలో ఉంది.
ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లకు ప్రసంశలతో పాటూ విమర్శలు కూడా వచ్చాయి. మే 31న ట్రైలర్ విడుదల చేస్తున్నారు. జూలై 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. కీరవాణి సంగీత దర్శకుడు.

