
స్టార్ హీరోలని కాకుండా కథలో దమ్ముండాలి అని కథను నమ్ముకొని సినిమాలు తీసి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన నిర్మాత దిల్ రాజు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దిల్ రాజు స్టార్ హీరోలతో సినిమాలు చేసినా కథకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటాడు. ఇదే బాటలో దిల్ రాజు ప్రస్తుతం లో బడ్జెట్ లో చేస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘కేరింత’. ‘వినాయకుడు’ ఫేం సాయి కిరణ్ అడవి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, శ్రీ దివ్య, తేజస్వి, అవంతిక హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తయ్యింది. ప్యాచ్ వర్క్ సీన్స్ తో పాటు అన్నీ ఫినిష్ చేసి ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసారు. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర టీం మిక్కి జె మేయర్ సంగీతం అందించిన కేరింత మూవీ ఆడియోని మే 9న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తోంది. కాలేజీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ తమను తాము ఐడెంటిఫై చేసుకునేలా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. అబ్బూరి రవి ఈ సినిమాకి కథా సహకారం అందిచడమే కాకుండా మాటల రచయితగా కూడా పనిచేసాడు.

