
‘బాలకృష్ణ సినిమా అంటే ఇదీ’ అని చెప్పడానికి కొన్ని బలమైన విషయాలున్నాయి. అద్భుతమైన భావోద్వేగం, బీభత్సమైన యాక్షన్, బలమైన పంచ్ డైలాగులు కలిసి బాలయ్య మార్క్ సినిమాను నిలబెడుతూ ఉంటాయి. తాజాగా కొత్త దర్శకుడు సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లయన్’ సినిమాలోనూ ఈ మూడు అంశాలు ఎక్కడా తగ్గలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. రుద్రపాటి రమణారావు నిర్మాణంలో నందమూరి నటసింహం బాలకృష్ణ, త్రిష, రాధికా ఆప్టేలు నటించిన సినిమా ‘లయన్’ రేపు (మే 14న) భారీ ఎత్తున విడుదలకు సిద్ధమౌతోంది.
ఈ సందర్భంగా ‘లయన్’ సినిమా విశేషాలను చెబుతూ బాలకృష్ణ ఈ సినిమా చేయడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “కొత్తదనమున్న కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. ఫార్ములా సినిమాలకు భిన్నంగా ఉండే ఈ సినిమా ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇస్తుంది” అని బాలకృష్ణ తెలిపారు. “లెజండ్ తర్వాత మామూలుగా ఎవరైనా మరో పెద్ద దర్శకుడితో సినిమా చేయొచ్చు . అయితే కేవలం ఈ సినిమాను స్క్రిప్ట్‌ను బలంగా నమ్మాను కాబట్టే కొత్త దర్శకుడితో సినిమా చేశా. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది” అంటూ బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

